ముఖ్యమంత్రి ఆలయాల బాట: పొరుగు రాష్ట్రంలో రుద్రాభిషేకం
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం పతాక స్థాయికి చేరుకుంది. ఇంకో మూడు రోజుల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ఆరంభం కానుంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన తొలి విడత పోలింగ్ ఆరంభమౌతుంది. తొలిదశలో ఉత్తర ప్రదేశ్‌లో 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. అదే నెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న అయిదింట్లో.. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లల్లో ప్రస్తుతం కాషాయ జెండా ఎగురుతోంది. పంజాబ్‌ను కాంగ్రెస్ పరిపాలిస్తోంది. పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, మిగిలిన రాష్ట్రాల్లో సత్తా చాటడానికీ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులనూ ఒడ్డుతోంది.

పంజాబ్‌లో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం.. కాంగ్రెస్‌కు పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని సైతం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ పేరును కాబోయే సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. మళ్లీ అధికారంలోకి వస్తే- ఛన్నీనే ముఖ్యమంత్రిని చేస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు.
ఆదివారం సాయంత్రం లూధియానాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఛన్నీని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరోసారి ఛన్నీ పేరును అధిష్ఠానం ఖరారు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉత్సాహం రెట్టింపయినట్టు కనిపిస్తోంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు, ఇతర పార్టీ నాయకులు తమ దూకుడును పెంచారు.
#WATCH | Punjab CM Charanjit Singh Channi offers prayers at Naina Devi temple in Bilaspur, Himachal Pradesh. pic.twitter.com/JuuQTMiiGV
— ANI (@ANI) February 7, 2022
ఈ పరిణామాల మధ్య చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ.. ఆలయాల బాట పట్టారు. కాబోయే ముఖ్యమంత్రిగా తన పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించిన మరుసటి రోజే ఆయన హిమాచల్ ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లారు. బిలాస్‌పూర్ జిల్లాలో వెలిసిన ప్రఖ్యాత నైనాదేవి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి మహాశివుడి ఆలయాన్ని దర్శించారు. రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. శివలింగాన్ని అభిషేకించారు. అనతరం ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. పంజాబ్‌లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications