కేజ్రీవాల్ పాలనా నమూనాకు పంజాబీలు ఫిదా; జాతీయ పార్టీగా ప్రధాని పీఠానికి గురి
పంజాబీ ఎన్నికల ఫలితాలలో ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్లో ప్రతిపక్ష పార్టీలను ఊడ్చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించి, ఢిల్లీ తర్వాత దాని రెండవ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది .ఇప్పటికే మూడొంతుల మెజారిటీ సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. జ్రీవాల్ పాలనా నమూనాకు పంజాబీలు ఫిదా అయ్యారని జాతీయ పార్టీగా ప్రధాని పీఠానికి గురి పడుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకు ఊతమిస్తున్నాయి ఆ పార్టీ కీలక నేత వ్యాఖ్యలు.

జాతీయ పార్టీగా ఆప్ .. రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా మాట్లాడుతూ, ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ స్థానంలో దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ అవతరిస్తుందని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. కాంగ్రెస్‌కి జాతీయ మరియు సహజ ప్రత్యామ్నాయం ఆప్ అవుతుందని రాఘవ్ చద్దా వెల్లడించారు.ఒక పార్టీగా కూడా ఆప్‌కి ఇది అద్భుతమైన రోజు, ఎందుకంటే ఈ రోజు తాము జాతీయ పార్టీగా మారామని ఆయన పేర్కొన్నారు.

కేజ్రీవాల్ దేశానికి ప్రధాని అవుతారు
మేము ఇకపై ప్రాంతీయ పార్టీలం కాదు. సర్వశక్తిమంతుడు అయిన భగవంతుడు మమ్మల్ని, అరవింద్ కేజ్రీవాల్‌ను ఆశీర్వదిస్తాడని రాఘవ్ చద్దా వెల్లడించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏదో ఒక రోజు దేశానికి నాయకత్వం వహిస్తారని, ప్రధానమంత్రి అవుతారని రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2012లో స్థాపించిన ఆప్ కంటే రెండు రాష్ట్రాలను గెలవడానికి బీజేపీకి చాలా ఎక్కువ సమయం పట్టిందని ఆయన సూచించారు.

మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రతిపక్షాలను ఊడ్చేసిన ఆప్
పంజాబ్‌లో ఆప్ ఆధిక్యంలో సగం మార్కును దాటింది. మ్యాజిక్ ఫిగర్ ను దాటడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార కాంగ్రెస్‌ను, బీజేపీని వెనక్కు నెట్టింది. కాంగ్రెస్‌కు చెందిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ మరియు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మరియు అకాలీదళ్‌కు చెందిన ప్రకాష్ సింగ్ బాదల్ వంటి భారీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ అభ్యర్థులపై వెనుకంజలో ఉన్నారు. ఆప్ నేతలు సైతం ఊహించని ఫలితాలు పంజాబ్ రాష్ట్రంలో వస్తున్నాయి.

కేజ్రీవాల్ పాలనా నమూనాకు పంజాబీలు ఫిదా
పంజాబ్ ప్రజలు కేజ్రీవాల్ పాలనా నమూనాను చూశారు. వారు దానిని ప్రయత్నించాలని కోరుకుంటున్నారని రాఘవ్ చద్దా పేర్కొన్నారు . ఐదు దశాబ్దాలుగా, పంజాబ్ ప్రజలను తమకు రావాల్సిన సౌకర్యాలు లేకుండా ఉంచిన వారు మరియు శాశ్వతంగా పాలిస్తారని భావించిన వారు ఇప్పుడు బయటకు విసిరివేయబడ్డారని రాఘవ్ చద్దా అన్నారు.వారికి గుణపాఠం చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అందుకే ఈ తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

పంజాబ్ అభివృద్ధికి ఆప్ పని చేస్తుంది
పంజాబ్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి మరియు పంజాబ్ రాష్ట్ర అభివృద్ధికి ఆమ్ ఆద్మీ పార్టీ బ్లూప్రింట్‌పై పని చేస్తుందని చద్దా చెప్పారు. ఈ విజయం అర్థం ఏమిటో మాకు తెలుసు. దీని విలువ మాకు అర్థమైంది అని పేర్కొన్న ఆయన పంజాబీ అభివృద్ధి కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కీలకంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే గెలుపు ఖాయం కావటంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ కీలకంగా మారుతుందని వారు భావిస్తున్నారు.ఏకంగా ప్రధాని పీఠానికే ఎక్కు పెడుతూ వ్యాఖ్యలు చెయ్యటం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications