సిద్ధూ సిక్సర్ కాంగ్రెస్ కు పనికొచ్చేనా ? ఆప్, అకాలీదళ్ హ్యాపీ-అమరీందర్ పాత్రపై సస్పెన్స్
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరుకు కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో చెక్ పెట్టింది. సీఎం అమరీందర్ తో అమీతుమీ అంటున్న నవ్ జ్యోత్ సింగ్ సిద్దూను పీసీసీ ఛీఫ్ గా నియమించింది. దీంతో పాటు నలుగురు వర్కింగ్ ప్రెసిటెంట్లనూ నియమించింది. దీనిపై సీఎం అమరీందర్ సింగ్ మండిపడుతుండగా... విపక్ష పార్టీలైన అకాలీదళ్, ఆప్ సంతోషంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు వచ్చే ఎన్నికల్లో తమకు లాభిస్తుందని భారీ అంచనాలతో ఉన్నాయి.

సిద్ధూ సిక్సర్
క్రికెట్లో సిక్సర్ల సిద్ధూగా పేరున్న నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ఇప్పుడు రాజకీయాల్లోనూ సిక్సర్ కొట్టాడు. కొంతకాలంగా పంజాబ్ రాజకీయాల్లో అమరీందర్ సింగ్ కు చెక్ పెట్టి ఆధిపత్యం సాధించాలని తపిస్తున్న సిద్ధూ.. ఇప్పుడు అనుకున్నట్లుగానే పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ అయిపోయాడు.
అమరీందర్ వర్సెస్ సిద్ధూగా సాగుతున్న పోరుకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు సిద్ధూకు పీసీసీ ఛీఫ్ పగ్గాలు అప్పగించడంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ గా పగ్గాలు చేపట్టబోతున్న సిద్ధూ ఇప్పుడు అమరీందర్ తో ఎలా వ్యవహరించబోతున్నారనే దానిపైనే వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడనున్నాయి.

సిద్ధూ నియామకంపై అకాలీ, ఆప్ హ్యాపీ
పంజాబ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూల పరిస్ధితులు ఉన్నాయి. గతంలో సుదీర్ఘకాలం బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్ ను అక్కడి రైతులు నమ్మడం లేదు. అలాగని మరో విపక్షం ఆప్ కు అధికారంలో అప్పగించే విషయంలో అక్కడి ఓటర్లలో డైలమా కొనసాగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు వారికి కలిసొచ్చింది. ముఖ్యంగా అమరీందర్, సిద్ధూ వర్గాలుగా కాంగ్రెస్ నేతలు విడిపోవడంతో ఎలాగో వచ్చే ఎన్నికల్లో వెన్నుపోట్లు తప్పవని అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ అంచనా వేస్తున్నాయి. దీంతో సిద్ధూ నియామకం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని అకాలీలు, ఆప్ భారీ ఆశలు పెట్టుకున్నాయి.

అమరీందర్ చేతుల్లోనే కాంగ్రెస్ భవిష్యత్తు
పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ పదవిని తన ప్రత్యర్ధి సిద్ధూకు కట్టబెడుతున్నట్లు ప్రచారం మొదలుకాగానే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం అమరీందర్ సింగ్ కు చివరికి కాంగ్రెస్ పెద్దలు భారీ షాక్ ఇచ్చేశారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా సిద్ధూను పీసీసీ ఛీఫ్ గా నియమించడంతో ఇప్పుడు అమరీందర్ సింగ్ అధికారం నిలబెట్టుకునేందుకు ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తిరిగి తాను సీఎం కావాలంటే కాంగ్రెస్ మరోసారి అధికారం సాధించాలి.
ఇందులో సిద్ధూ పాత్ర కీలకంగా మారిపోయింది. అలా అని సిద్ధూతో కలిసి పనిచేసే పరిస్ధితులు లేవు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూల పరిస్ధితులు ఉన్నాయి. దీంతో అధికారం ముంగిట అమరీందర్ ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓ విధంగా చెప్పాలంటే పీసీసీ ఛీఫ్ సిద్ధూయే అయినా పంజాబ్ కాంగ్రెస్ భవిష్యత్తు అమరీందర్ చేతుల్లోనే ఉండబోతోంది.












Click it and Unblock the Notifications