పంజాబ్ ఎన్నికల ముందు జైలు నుంచి డేరా బాబా విడుదల: 60కిపైగా సీట్లపై ప్రభావం
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల మరికొద్ది రోజుల్లో జరగనున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు సాద్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీబ్ సింగ్(డేరా బాబా) జీవిత ఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ఆయనకు 21 రోజులపాటు బెయిల్ లభించింది. శిక్ష ఖరారైన కైదీలకు ఇచ్చే ప్రత్యేక సెలవు(ఫర్లాహ్) కింద ఆయనకు ఈ అవకాశం దక్కిందని అధికారులు చెబుతున్నారు.
2017 నుంచి రోహ్తక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారి జైలు నుంచి బయటకు రానున్నారు. అయితే, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన జైలు నుంచి విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డేరా బాబా బెయిల్‌కు ఎన్నికలకు సంబంధం లేదని, నిబంధనల ప్రకారమే ఆయనకు ఫర్లాహ్ లభించిందని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా వెల్లడించారు.

కాగా, పంజాబ్ రాష్ట్రంలోని మాల్వా ప్రాంతంలో గుర్మీత్ సింగ్ తోపాటు ఆయన అనుచరులకు మంచి పట్టుంది. గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ దాదాపు 60 అసెంబ్లీ నియోజకవర్గాలకుపైగా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంట్, శాషనసభ ఎన్నికల్లోనూ ఆయన ప్రభావం ఇప్పటికే కనిపించడం గమనార్హం.
అయితే, డేరా బాబా జైలుకు వెళ్లినప్పటి నుంచి స్థానిక నేతల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు ఆయన అనుచరులు. అధికార పార్టీ నేతలతో సత్ససంబంధాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే గుర్మీత్ సింగ్ జైలు నుంచి బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తున్న గుర్మీత్ రామ్ రహీబ్ సింగ్ పలు నేరారోపణలు నిరూపితం కావడంతో జైలు పాలయ్యారు. ఇద్దరు సాద్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషి తేలడంతో కోర్టు డేరా బాబాకు జీవిత ఖైదును విధించింది. దీంతో సునారియా జైలులో గుర్మీత్ సింగ్ జైలు జీవితం గడుపుతున్నాడు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యాడు. అతనిపై పలు హత్యా నేరారోపణలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications