భారత్ చేసుకున్న అదృష్టం ఏంటంటే..!!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తోన్నారు. రెండు రోజుల పాటు ఆయన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఇది చాలా అరుదు. ప్రధాని నేరుగా విమానాశ్రయానికి వెళ్లి అతిథిని ఆహ్వానించడం అనేది అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే చోటు చేసుకుంటుంది.
భారత పర్యటనకు బయలుదేరడానికి ముందు ఆయన క్రెమ్లిన్ లో ఇండియాటుడే/ఆజ్ తక్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. పుతిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇండియాటుడే/ఆజ్ తక్ టెలికాస్ట్ చేసింది. ఇందులో పలు అంశాల గురించి ప్రస్తావించారు. న్యూక్లియర్ ఆయుధాలు మొదలుకుని చమురు విక్రయాలు, భారత్ తో కుదుర్చుకోనున్న రక్షణ ఒప్పందాలపై మాట్లాడారు. భారత్- రష్యా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న మైత్రీ బంధాన్ని ప్రశంసించారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలక భాగస్వామిగా ఉంటోందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు పుతిన్. ఒత్తిడికి లొంగిపోని నాయకుడిగా అభివర్ణించారు. అమెరికా భారత్‌పై టారిఫ్ రూపంలో ఒత్తిడి తెస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీతో బలమైన, విశ్వసించదగ్గ, విశ్వసనీయమైన, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. ఆయన చాలా విశ్వసించదగ్గ నాయకుడని కితాబిచ్చారు.
ఓ గొప్ప దేశానికి ఓ గొప్ప వ్యక్తి నాయకత్వం వహిస్తున్నాడని, ఈ విషయంలో భారత్ అదృష్టం చేసుకుందని వ్యాఖ్యానించారు. భారత గడ్డపై మోదీ నివసిస్తోండటం, ఇక్కడ శ్వాసిస్తోండటం ఈ దేశానికి ఎంతగానో మేలు చేస్తుందని చెప్పారు. ఆయనతో చిరకాల పరిచయం ఉందని పుతిన్ అన్నారు. ఇప్పుడు తాను చేసిన వ్యాఖ్యల పట్ల మోదీ కోప్పడకపోవచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆయన విషయంలో తాను చూసింది, ఆలోచించినది మాత్రమే చెబుతున్నానని అన్నారు. మోదీలాంటి వ్యక్తితో మాట్లాడటం తనకు చాలా ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు.
రక్షణ, ఆర్థిక వ్యవస్థ, మానవతా సహకారం, హైటెక్ అణు పదార్థాల అభివృద్ధి వంటి కీలక రంగాలతో సహా అన్ని విషయాలలో భారత్-రష్యా సంబంధాలను ప్రధాని మోదీ నిజంగా బలోపేతం చేయాలనుకుంటున్నారని పుతిన్ తెలిపారు. మోదీ మాస్కోలో తన అధికారిక నివాసానికి వచ్చినప్పుడు ఆయనతో చాలాసేపు టీ తాగుతూ పలు విషయాలపై సాధారణ వ్యక్తుల్లాగే ఆసక్తికరమైన సంభాషణలు జరిపామని గుర్తు చేసుకున్నారు. రాబోయే సమావేశం చాలా ఉపయోగకరంగా, ఆసక్తికరంగా ఉంటుందని తాను ఎదురుచూస్తున్నానని పుతిన్ ధృవీకరించారు.












Click it and Unblock the Notifications