Rafale Fighter jets:అంబాలా ఎయిర్‌బేస్‌లో వాటర్ సెల్యూట్, మోడీ ,రాజ్‌నాథ్ అభినందనలు
అంబాలా: ఫ్రాన్స్ నుంచి దాదాపు 7వేల కిలోమీటర్ల మేరా ప్రయాణించిన రాఫెల్ యుద్ధ విమానాలు ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాయి. అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకున్న యుద్ధ విమానాలకు ముందుగా వాటర్ సెల్యూట్ దక్కింది.
వాటర్ సెల్యూట్
భారత వైమానిక దళంతో పాటు రక్షణ రంగం కూడా మరింత బలోపేతం అయ్యింది. ఫ్రాన్స్ నుంచి భారత్‌కు రాఫెల్ యుద్ధ విమానాలు చేరుకున్నాయి. హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకున్న అత్యాధునిక యుద్ధ విమానాలకు ఆర్మీ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా స్వాగతం పలికారు. అనంతరం ఈ యుద్ధ విమానాలకు వాటర్ సెల్యూట్ లభించింది. భారత్ చైనా వివాదం నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఈ రోజు భారత్ వైపు చూసింది. కొన్ని మరమత్తుల తర్వాత ఈ యుద్ధ విమానాలను తూర్పు లడాఖ్‌కు తరలిస్తారు.
ప్రధాని మోడీ ట్వీట్
రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్‌బేస్‌ను టచ్ చేయగానే ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఆయన యుద్ధ విమానాలను స్వాగతిస్తూ హిందీలో ట్వీట్ చేశారు. భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది అని చెప్పారు. శత్రువులను సంహరిస్తుందని , దేశంకు రక్షణ కవచంలా ఉంటాయని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
సురక్షితంగా దిగాయి
ఇదిలా ఉంటే రాఫెల్ యుద్ధ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయంటూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. భారత మిలటరీ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని కొనియాడారు.భారత వాయుసేన అవసరాలు తీర్చేలా రాఫెల్ యుద్ధవిమానాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపుతోనే ఈ అత్యాధునిక యుద్ధ విమనాలను భారత్ కొనుగోలు చేసిందని అన్నారు రాజ్‌నాథ్ సింగ్. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ సాంకేతిక వ్యవస్థలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటాయని చెప్పారు. రేడార్ నుంచి సెన్సార్ల వరకు అన్నీ అద్భుతంగా ఉంటాయని వెల్లడించారు.
ఫ్రాన్స్ ప్రభుత్వానికి ధన్యవాదాలు
కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా అనుకున్న సమయంలో యుద్ధ విమానాలను డెలివరీ చేసినందుకు ఫ్రాన్స్ ప్రభుత్వానికి అదే సమయంలో డసాల్ట్ ఏవియేషన్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు రాజ్‌నాథ్ సింగ్. ఇక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి యుద్ధ విమానాలు చేరడంతో ఐఏఎఫ్‌కు శుభాభినందనలు తెలిపారు రక్షణశాఖ మంత్రి. 17వ స్క్వాడ్రాన్‌లో చేరిన ఈ గోల్డెన్ బర్డ్స్ మన లక్ష్యాలను నిజం చేస్తాయని ఆ దిశగా పనిచేస్తాయని ఆకాంక్షించారు రాజ్‌నాథ్ సింగ్.
భారత్‌లోకి ఎంట్రీ ఇలా
యూఏఈ నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు బుధవారం మధ్యాహ్నం సమయంలో భారత గగనతలంలోకి ప్రవేశించాయి. జూలై 27వ తేదీన ఫ్రాన్స్‌లోని డస్సాల్ట్ ఏవియేషన్‌కు చెందిన ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న రాఫేల్ యుద్ధ విమానలు 3200 కిలోమీటర్లు ప్రయాణం చేసి యూఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్‌కు చేరుకుని నైట్ హాల్ట్ చేశాయి. భారత గగనతలంలోకి ప్రవేశించగానే ఐఎన్ఎస్ యుద్ధ నౌక నుంచి స్వాగతం పలుకుతూ రేడియో మెసేజ్ వెళ్లింది. ఇందుకు రాఫేల్ జెట్ కమాండర్ కూడా ధన్యవాదాలు చెబుతూ సమాధానం ఇచ్చారు. ఈ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించగానే వీటికి రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు స్వాగతం పలికాయి. అనంతరం ఐదు ఫైటర్ జెట్లతో పాటు ఈ రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా అంబాలా ఎయిర్‌బేస్ వైపు కదిలాయి.

అంబాలాకు ఎస్కార్ట్ చేసిన సుఖోయ్
ఇక గగనతలంలో ఐదు ఫైటర్ జెట్లకు స్వాగతం పలికిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానాలకు సంబంధించిన వీడియోను ట్విటర్ ద్వారా రక్షణ శాఖ కార్యాలయం విడుదల చేసింది. అంబాలాలో ఈ యుద్ధ విమానాలకు ఐఏఎఫ్ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా స్వాగతం పలికారు. అనంతరం వీటికి వాటర్ సెల్యూట్ ఇవ్వడం జరిగింది. భారీ మొత్తం వెచ్చించి భారత్ ఈ అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. మొత్తం రూ.59వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇక ల్యాండింగ్ సందర్భంగా ఎలాంటి అడ్డంకులు కలగకుండా వైమానిక అధికారులు చర్యలు తీసుకున్నారు. రన్‌వేపై పక్షులు లేకుండా అధికారులు చెదరగొట్టారు












Click it and Unblock the Notifications