ఢిల్లీలో రాహుల్ జోడో యాత్ర -కేంద్రం కరోనా ఆంక్షల వేళ- కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ!
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగిపోతోంది. ఇప్పటికే తమిళనాడు నుంచి కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో సాగిన ఈ యాత్ర ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఇవాళ ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ.. ఇవాళ రాజధానిలో ఉన్న పలువురు జాతీయ దివంగత నేతల సమాధుల్ని సందర్శించి నివాళులు అర్పించబోతున్నారు.
ఇవాళ ఉదయం ఫరీదాబాద్ నుంచి ఢిల్లీలోకి రాహుల్ యాత్ర అడుగుపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ సీనియర్లు జైరాం రమేష్, పవన్ ఖేరా, భూపీందర్ సింగ్ హుడా, రణ్ దీప్ సూర్జేవాలా, కుమారి సెల్జా వంటి వారు ఆయనతో కలిసి నడిచారు. అనంతరం రాహుల్ తల్లి సోనియా, సోదరి ప్రియాంక కూడా ఆయనకు జత కలిశారు. ఇప్పటికే ఓసారి రాహుల్ తో కలిసి నడిచిన వీరిద్దరూ మరోసారి రాహుల్ తో ఇవాళ భారత్ జోడో యాత్రలో కలిసి నడిచారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విద్వేష విపణిలో ప్రేమ దుకాణం తెరిచేందుకు తాను ఈ యాత్ర చేస్తున్నట్లు గుర్తుచేశారు.

తన యాత్ర తర్వాత దేశంలోని సామాన్యుడు కూడా ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడని రాహుల్ తెలిపారు. ప్రతి రాష్ట్రంలో లక్షలాది మంది యాత్రలో చేరారని, మీ ద్వేషపూరిత 'బజార్'లో ప్రేమ దుకాణం తెరవడానికి మేము ఇక్కడ ఉన్నామని ఆరెస్సెస్, బీజేపీ జనాలకు తాను చెప్పదల్చుకున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు పరస్పరం సాయం చేసుకునే నిజమైన హిందుస్థాన్ ని ఆవిష్కరించడమే తన యాత్ర ఉద్దేశమని రాహుల్ వెల్లడించారు. బీజేపీ, ఆరెస్సెస్ లు దేశాన్ని విద్వేషంలో నింపేస్తుంటే తాము జనంలో ప్రేమను నింపుతున్నామన్నారు.

మరోవైపు రాహుల్ యాత్ర ఢిల్లీలో అడుగుపెట్టకముందే కేంద్రం కోవిడ్ రూల్స్ పాటించాలని హెచ్చరికలు చేసినా, పాటించకపోతే నిలిపేస్తామని ఆరోగ్యమంత్రి మాండవీయ ప్రకటించినా రాహుల్ మాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో ఈ వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శలకు దారి తీస్తోంది. రాహుల్ కోవిడ్ రూల్స్ ఉల్లంఘనపై బీజేపీ నేతలు మండిపడుతుండగా.. బీజేపీ నేతలు కూడా ఇలాంటి పరిస్ధితుల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో యాత్రలు చేసిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తుచేస్తోంది.












Click it and Unblock the Notifications