విపక్ష ఎంపీల కవాతులో రాహుల్ గాంధీ-నోరెత్తనీయడం లేదని కేంద్రంపై నిప్పులు
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాలను కేంద్రం గొంతు నొక్కుతోందని ఆరోపిస్తూ ఇవాళ ఉభయసభల్లోని విపక్ష ఎంపీలు ఢిల్లీలో మార్చ్ నిర్వహించారు. రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షను నిరసిస్తూ పార్లమెంట్ లోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి ఢిల్లీ విజయ్ చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఉభయసభలకు చెందిన పలువురు విపక్ష ఎంపీలు పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన మార్చ్ చివరి పాయింట్ అయిన విజయ్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను లేవనెత్తడానికి కూడా విపక్షానికి అనుమతి లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్‌లో బిల్లుల తర్వాత బిల్లులు గందరగోళంలో ఆమోదం పొందుతున్నాయి. పార్లమెంటును నడిపే పద్ధతి ఇది కాదు. ప్రధాని సభకు రారు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఏ అంశాన్ని లేవనెత్తడానికి మాకు అనుమతి లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని దురదృష్టకర హత్యని రాహుల్ అభివర్ణించారు.

ఒక మంత్రి రైతులను చంపాడు. అది ప్రధానికి తెలుసు. నిజం ఏమిటంటే ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారులు రైతులకు వ్యతిరేకం. ఈ ఎంపీలను రాజ్యసభ ఛైర్మన్ లేదా ప్రధాని సస్పెండ్ చేయలేరు. కానీ రైతుల ఆదాయాన్ని దొంగిలించాలనుకునే అధికారంతో ఎంపీల్ని సస్పెండ్ చేశారని రాహుల్ ఆరోపించారు.

మరోవైపు 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను ఉపసంహరించాలన్న డిమాండ్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించడంతో ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి మధ్యాహ్నం వాకౌట్ చేశారు. తమ సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అనుమతించకపోవడంతో వాకౌట్ చేశాపు. వెంటనే విపక్ష సభ్యులు సస్పెన్షన్‌ను రద్దు చేయాలంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇంతలో, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, "తమ సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవడం కోసం ప్రభుత్వం వారితో (సస్పెండ్ చేయబడిన ఎంపీలు) వ్యక్తిగత స్థాయిలో చర్చలు జరుపుతోంది. వారు కనీసం విచారం వ్యక్తం చేయాలని తాను స్పష్టం చేసినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications