పెగాసస్ ప్రజాస్వామ్యాన్ని అణిచేసే యత్నం-సుప్రీం కమిటీపై నమ్మకముంది- రాహుల్ కామెంట్స్
దేశంలో విపక్ష రాజకీయ నేతల్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. పెగాసస్ వాడకం ద్వారా రాజకీయ నాయకులపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నమని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
పెగాసస్ వివాదం నేపథ్యంలో దీనిపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు ఇవాళ నియమించింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. నిపుణుల కమిటీపై తమకు నమ్మకం ఉందన్నారు. ఈ కమిటీ విచారణతో వాస్తవాలు బయటికి వస్తాయని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. పెగాసస్ దేశంపై, దేశంలోని సంస్ధలపై దాడి అని రాహుల్ అభిప్రాయపడ్డారు. అసలు పెగాసస్ ను ఎవరు కొన్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కేంద్రానికి రాహుల్ గాంధీ మూడు ప్రశ్నలు సంధించారు. పెగాసస్ స్పైవైర్ కు ఎవరు ఆమోదముద్ర వేశారు ?,
ఎవరికి వ్యతిరేకంగా వాడారు ?, మన దేశ పౌరుల సమాచారం ఇతర దేశాలకు అందుబాటులో ఉందా అని రాహుల్ ప్రశ్నించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనూ కాంగ్రెస్ ఎంపీలు పెగాసస్ వివాదాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారని, బీజేపీ దీనిపై చర్చ కోరుకోవడం లేదని రాహుల్ ఆక్షేపించారు. ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానులు, బీజేపీ మంత్రులపై పెగాసస్‌ను ఉపయోగించారని రాహుల్ తెలిపారు. పెగాసస్ ద్వారా లభించిన డేటా ప్రధానమంత్రి, హోంమంత్రికి అందుతుందా? ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ డేటా వెళుతుంటే.. ప్రధానమంత్రికి, అది నేరపూరిత చర్య" అని రాహుల్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications