విద్యార్థులు ఒంటరి కాదు.. వారికి అండగా ఉంటాం: రాహుల్ గాంధీ
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై దేశ రాజధాని దిల్లీలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ప్రతిపక్ష ఇండియా కూటమి మద్దతు ప్రకటించింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని మరింత పెంచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. విద్యార్థులు ఒంటరి కాదని.. అండగా ఉంటామని స్పష్టం చేశారు.
అంతకుముందు రాహుల్ గాంధీ నివాసంలో కాంగ్రెస్ ఎంపీలు అత్యవసరంగా సమావేశం అయ్యారు. నీట్ పేపర్ లీకేజీ అంశంలో తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపారు. విద్యార్థుల నిరసనలు, తాజా పరిణామాలపై చర్చించారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించేందుకు రాహుల్ గాంధీతో పాటు ఎంపీలంతా గాంధీ స్మృతివనం వద్దకు బస్సులో బయల్దేరారు. కానీ మార్గమధ్యంలోనే బస్సును పోలీసులు ఆపివేశారు. దాంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఈ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మొదట ఇండియా గేట్ వద్దకు వెళ్లాలని భావిస్తే పోలీసులు అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. తర్వాత గాంధీ స్మృతికి వెళ్లాలని చెప్పినా తమ బస్సును అడ్డుకున్నారని మండిపడ్డారు. కానీ తమ సందేశం ఒక్కటే.. విద్యార్థులారా.. తామంతా మీతోనే ఉన్నాం.. అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇక విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంతోపాటు కేంద్రమంత్రుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.

ఇదిలాఉంటే విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్న జంతర్ మంతర్ వద్ద మొబైల్, ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు పోలీసులు. జంతర్ మంతర్ నుంచి 1.5 కిలోమీటర్ల వరకూ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అర్ధ రాత్రి 12 గంటల వరకు ఆ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ తో శుక్రవారం దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications