ఏపీలో 4 కొత్త పోలీసు కమిషనరేట్లు- అమరావతి రైతుల కౌలు సవరణ-కేబినెట్ కీలక నిర్ణయాలు..!
అమరావతి సచివాలయంలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలోని నాలుగు ముఖ్య నగరాల్లో పోలీసు కమిషనరేట్ల ఏర్పాటుకు నిర్ణయించింది. అలాగే అమరావతి రాజధానిలో పనులకు అనుమతుల మంజూరు, రైతులకు కౌలు పెంపు వంటి నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమలు, ఇతర అవసరాలకు భూకేటాయింపులు కూడా చేసింది.
రాష్ట్రంలోని రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలులో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో పోలీస్ పరిపాలన మరింత బలోపేతం అవుతుందని భావిస్తోంది. అలాగే రాజధాని అమరావతి గ్రామాల్లో రూ.1,548.98 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. అలాగే రాజధానిలో రైతులకు కనీస కౌలు నిబంధనల్ని సవరించింది. దాచేపల్లిలో 'మై హోమ్ ఇండస్ట్రీస్' గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ యూనిట్‌కు ప్రోత్సాహకాలు, తిరుపతి శ్రీసిటీలో 'క్యాటర్‌పిల్లర్' గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే కుప్పంలో పలు పరిశ్రమలకు భూ కేటాయింపుల్ని ఆమోదించింది.

హంద్రీ నీవా సుజల స్రవంతి పనులపై కేబినెట్లో ఆరా తీసిన సీఎం చంద్రబాబు .. 2027లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హంద్రీనీవా ఫేజ్-2లో మిగిలిన పనులకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైన నేపథ్యంలో, పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులను 2027 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లికి స్పష్టం చేశారు. అలాగే రాయచోటి నియోజకవర్గ పరిధిలోని HNSS మెయిన్ కెనాల్ కిమీ 490-535 వరకు సుమారు రూ.350 కోట్ల విలువైన పనులు కూడా సమగ్రంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను HNSS కెనాల్‌తో అనుసంధానం చేసి, మార్గమధ్యంలోని చెరువులను నింపేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. అలాగే ఈ పనులు పూర్తయితే HNSS ద్వారా తాగునీరు, సాగునీటి అవసరాలు తీరడంతో పాటు సుమారు 25 వేల ఎకరాల ఖాళీ చెరువులను నింపి ప్రజలకు నీటి భరోసా కల్పించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సీఎంకు తెలిపారు.















Click it and Unblock the Notifications
