కొంత ఊరట: రైలు ఛార్జీల పెంపుపై తగ్గిన కేంద్రం
న్యూఢిల్లీ: పెంచిన రైలు ప్రయాణ, రవాణా ఛార్జీలు మరి కొన్ని గంటల్లో అమల్లోకి రానున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అటు ప్రతిపక్షాలు, ఇటు స్వపక్షం నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో పెంచిన రైలు ఛార్జీలను మంగళవారం పాక్షికంగా వెనక్కి తీసుకుంది.
రెండో తరగతి, సబర్బన్ రైలు ప్రయాణికులకు 80 కిలోమీటర్ల వరకూ 14.2 శాతం చార్జీల పెంపుదల నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే నెలవారీ సీజన్ టికెట్లు తీసుకునే వారికీ పెంచిన ఛార్జీల తీవ్రతను తగ్గించింది. దీనివల్ల మెట్రో, ఇతర పెద్ద నగరాల్లో ప్రయాణించే లక్షలాది మందికి ఊరట కలుగుతుంది.

80 కిలోమీటర్ల వరకూ రెండో తరగతి సబర్బన్ ప్రయాణికులకు కొత్త ఛార్జీలు వర్తించవని రైల్వే శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. రిజర్వేషన్‌లేని ప్రయాణికులకు సంబంధించిన ఛార్జీల పెంపుదల 28నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఎమ్‌ఎస్‌టిలకు మాత్రం 14.2 శాతం మేర పెంచిన ఛార్జీలే వర్తిస్తాయని స్పష్టం చేసింది.
తాజా సవరణ వల్ల నెలవారీ టికెట్ పాస్‌లు కలిగిన వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఐదు కిలోమీటర్లకుగాను నెలవారీ సీజన్ టికెట్ రేటు 150 నుంచి వంద రూపాయలకు తగ్గుతుంది. అంతేగాక 150 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసే వారికి 520 రూపాయల వరకూ ఆదా అవుతుంది. ముంబై లాంటి నగరాల్లోని రైలు ప్రయాణికులకు కేంద్ర నిర్ణయం కొంత ఊరట కలిగించినట్లయింది.












Click it and Unblock the Notifications