ఆశ్చర్యం... మనదేశంలో ఇంతవరకు రైలు లేని రాష్ట్రం
రోజురోజుకు భారతీయ రైల్వే తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తోంది. వందే భారత్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లను తెచ్చిన భారతీయ రైల్వే త్వరలోనే బుల్లెట్ రైలును పట్టాలెక్కించబోతోంది. ఈ ఏడాది చివరలో హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద నెట్ వర్క్ కలిగిన రైల్వే వ్యవస్థల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రతిరోజు కోటి మంది ప్రయాణికులు 13వేల రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
1853 నుంచి 2024 వరకు రైలు రాలేదు
ఇంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రైల్వే వ్యవస్థకు సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం మన దేశంలోనే ఉంది. మనకున్న 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఇంతవరకు రైలు అడుగుపెట్టలేదు. రైలు కూతే అక్కడి ప్రజలు వినలేదు. 1853లో ప్రారంభమైన భారతీయ రైల్వే 2024 వచ్చేవరకు కూడా అక్కడకు ప్రవేశించలేదంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఆ రాష్ట్రం ఏదో కాదు.. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన సిక్కిం. అత్యంత చౌకైన రవాణా సాధనమైన రైల్వేను అక్కడకూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ ఏడాది చివరికల్లా వస్తుంది
భారతీయ రైల్వే అక్కడ రైల్వే లైను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా అక్కడి ప్రజలకు రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉంది. సిక్కింలో కూడా రైలు కూత వినపడితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు రైలు సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే లైన్ల పొడవు 1.15 లక్షల కిలోమీటర్లుగా ఉంది. రద్దీగా ఉండే మార్గాల్లో మూడోలైను, నాలుగోలైను నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్కీం కింద విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications