ఢిల్లీ తొక్కిసలాట ఘటన.. పరిహారం ప్రకటించిన రైల్వే శాఖ
ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి వివరాలను ఇప్పటికే రైల్వే శాఖ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న రాత్రి మహాకుంభమేళాకు వెళ్లడానికి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన భక్తులు ఒకసారిగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం
రైళ్లు ఎక్కడానికి ఢిల్లీ రైల్వేస్టేషన్లో భారీ సంఖ్యలో గుమికూడిన ప్రయాణికులు అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన పైన రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన నేపథ్యంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు భారతీయ రైల్వే ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తున్నామని ప్రకటించింది.

గాయపడిన వారికి పరిహారం ఇలా
తీవ్రగాయాల పాలైన వారికి రెండున్నర లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నామని రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది రైల్వే శాఖ. నిన్న రాత్రి రైల్వేస్టేషన్ లో ప్రయాగ్ రాజ్ వెళ్ళే రైళ్లు రద్దు అయ్యాయి అన్న వదంతులతో జనం ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు.
తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి
ఎలాగైనా ప్రయాగ్ రాజ్ వెళ్లాలని ఆలోచనతో ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15 వద్ద స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఆలస్యంగా రావడంతో ఒక్కసారిగా భారీ జన సమూహం కారణంగా తొక్కిసలాట జరిగింది. దీంతో 18 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట ఘటన పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలియజేశారు
ప్రాణ నష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి
అక్కడ జరిగిన ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. ఇక ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications