కరోనా మహమ్మారిబారినపడిన మరో సీఎం: ఐసోలేషన్‌లోకి అశోక్ గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనాబారినపడ్డారు. గెహ్లాట్ సతీమణి సునితకు బుధవారం కరోనావైరస్ సోకడంతో ఆయన నిన్నటి నుంచీ అసోలేషన్లో ఉన్నారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయించుకోగా.. తనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అశోక్ గెహ్లాట్ గురువారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ.. వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు 69ఏళ్ల ఈ సీనియర్ కాంగ్రెస్ నేత తెలిపారు. అక్కడ్నుంచే విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కాగా, రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రోజుకు 10వేలకుపైగానే కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 16వేల కేసులు నమోదు కాగా, 120 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,63,577కుచేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3926 మరణాలు సంభవించాయి. కాగా, మే 21 వరకు రాజస్థాన్ రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉంది.












Click it and Unblock the Notifications