చైనా,పాకిస్తాన్ లకు భారతభూభాగాన్ని అప్పగించింది కాంగ్రెస్ ప్రధానులే: రాహుల్ కు రాజ్‌నాథ్ కౌంటర్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల తూటాలను సంధిస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న పోరులో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది.
Recommended Video

యూపీ ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ సింగ్
ఉత్తరప్రదేశ్‌లోని కల్నల్ గంజ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన బహిరంగ ర్యాలీలో సింగ్ మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుందని, ఈసారి తొలి రెండు దశలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు రాజ్ నాథ్ సింగ్ కౌంటర్
మోదీ భారత ప్రధాని అయిన తర్వాత చైనా-పాకిస్థాన్‌ల మధ్య 'పరస్పర స్నేహం' ఉందని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారని, దేశ ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయని రాహుల్ గాంధీకి కనీసం ఆధునిక చరిత్ర అయినా తెలిసి ఉండాలి అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు రాజ్ నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు.

చైనా, పాకిస్తాన్ లకు భారత భూభాగాన్ని అప్పగించింది కాంగ్రెస్ పీఎంలే
చరిత్రను ప్రస్తావిస్తూ, రాజ్‌నాథ్ సింగ్ ఇలా అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడు, పాకిస్తాన్ అక్రమంగా షక్స్‌గామ్ లోయను చైనాకు అప్పగించిందని గుర్తు చేశారు. పాకిస్తాన్‌లో కారకోరం హైవే నిర్మించబడినప్పుడు ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. సీపీఈసీ మొదలైనప్పుడు మన్‌మోహన్ ప్రధానిగా ఉన్నారని పేర్కొన్నారు. చైనా పాకిస్థాన్ లతో పరస్పర స్నేహ సంబంధాలు కొనసాగించింది కాంగ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. గాల్వాన్ ఘర్షణలో మోదీ ప్రభుత్వ తీరును ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీని కూడా ఆయన విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే హోలీ, దీపావళి రోజున ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హోలీ, దీపావళి రోజున ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. హామీలన్నీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. యూపీలో గతం కంటే ఎక్కువ సీట్లతో బిజెపి కి అధికారం కట్టబెట్టాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్లో మూడవ దశ ఎన్నికల పోలింగ్ కు ఒకరోజు ముందు రాజ్ నాథ్ సింగ్ యూపీ ప్రజలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో మూడవ దశ ఎన్నికల పోలింగ్ 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.












Click it and Unblock the Notifications