వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామగుండం ఫ్లోంటింగ్ సోలార్ ప్లాంట్: నీటిపై తేలే అతి పెద్ద విద్యుదుత్పత్తి కేంద్రం ఎలా పని చేస్తుంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రామగుండంలో దేశంలోనే అతి పెద్ద నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో 'నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కార్పొరేషన్'(ఎన్టీపీసీ) 'నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం'( ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్) నిర్మిస్తోంది. నిర్మాణదశలోనే ఇది దేశంలోనే 'అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్'గా రికార్డులకు ఎక్కింది.

ప్రస్తుతం ఇక్కడ ప్రతి రోజు 37.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతోంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసేలా దీన్ని మరింత పెద్దగా నిర్మిస్తున్నారు.

గతంలో ఈ రికార్డ్ విశాఖపట్నంలోని సింహాద్రి ఎన్టీపీసీ ప్రాజెక్ట్ సొంతం.

రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అవసరాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని కాలువ ద్వారా తీసుకువచ్చి నిల్వ చేసేందుకు గతంలో ఓ రిజర్వాయర్ నిర్మించారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో సుమారు వెయ్యి ఎకరాల్లో నీరు నిల్వ ఉంది.

ఈ రిజర్వాయర్‌లోనే దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. 100 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకునేటప్పటికి ఈ సోలార్ ప్లాంట్ రిజర్వాయర్ లోపల నీటి ఉపరితలంపై 450 ఎకరాల మేర విస్తరిస్తుంది.

సోలార్ ప్యానళ్లు నీటిపై తేలియాడటం వల్ల ప్రాజెక్టులో నీరు ఆవిరయ్యే శాతం గణనీయంగా తగ్గుతుంది

గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యం

అణు, బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాలలో కర్బన ఉద్గారాలతో వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ లాంటి దేశాల్లో థర్మల్ విద్యుత్ వాటా ఎక్కువ.

భూతాప నివారణ లక్ష్యాలలో భాగంగా థర్మల్ విద్యుత్‌ను తగ్గించాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ 2032 నాటికి 6 వేల మెగావాట్ల 'గ్రీన్ పవర్' ( పర్యావరణహిత విద్యుత్) ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందులో భాగంగా పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపన వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల, విద్యుత్ అవసరాలు తీరడంతో పాటుగా పర్యావరణానికి మేలు కలగనుంది.

''ఈ పునరుత్పాదక వనరుల్లో ముఖ్యంగా సౌరశక్తి తో విద్యుత్ ఉత్పత్తి పై ఎక్కువగా 'నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ట (ఎన్టీపీసి) దృష్టి సారించింది. 2005 నుంచే ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రి ఎన్టీపీసీ ప్లాంట్‌లోని రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ఉత్పత్తిపై ఎన్టీపీసీ ప్రయోగాలు చేస్తూ వస్తోంది'' అని రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ బీబీసీతో చెప్పారు..

''ప్రస్తుతం రోజూ 37.5 మెగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేసి సదరన్ గ్రిడ్‌కు అందిస్తున్నాం. మరో 30 మెగావాట్ల సోలార్ ప్యానల్స్ కేబుల్స్ కలిపే పని కొనసాగుతోంది. ఫిబ్రవరి 2022 నాటికి పూర్తి స్థాయిలో 100 మెగావాట్ల ఉత్పత్తి సాధిస్తాం'' అని ఆయన తెలిపారు.

గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్‌లో భాగంగా ఎన్టీపీసీ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది

నీటిపై తేలియాడే ప్లాంట్లో ఎన్నెన్నో ప్రత్యేకతలు

కేరళలోని కాయంకుళంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ సింహాద్రి థర్మల్ స్టేషన్‌లలో గతంలో 'ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్'లను ఎన్టీపీసీ నిర్మించింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లలో సౌరశక్తి ని గ్రహించి విద్యుత్ శక్తి గా మార్చే సోలార్ ప్యానల్స్ మాత్రమే నీటిపై తేలియాడుతూ ఉంటాయి.

అందుకు భిన్నంగా రామగుండం ఎన్టీపీసీలో తేలియాడే పవర్ స్టేషన్‌లో సోలార్ ప్యానల్స్‌తో పాటుగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కు ఉపయోగించే అన్ని రకాల యంత్రాలు, పరికరాలు నీటిపైనే తెలియాడుతూ ఉండటం ప్రత్యేకత.

''ప్రస్తుతం దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ ఇదే. రిజర్వాయర్ మధ్యలో నీటి ఉపరితలంపై విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్న యంత్రాలన్నీ నీటిపైనే తేలియాడుతూ ఉంటాయి. సోలార్ ప్యానల్స్ తోపాటు ట్రాన్స్ ఫార్మర్. ఇన్వర్టర్, స్విచ్ గేర్ ప్యానల్ అన్నీనీటిపైనే తేలియాడుతున్నాయి'' అని ఎన్టీపీసి, రామగుండం సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ విభాగం జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ 'బీబీసీ’తో చెప్పారు.

విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్న పరికరాలను 'ఫెర్రో సిమెంట్' టెక్నాలజితో నిర్మించిన ఫ్లాట్‌ఫామ్‌లపై నిలిపారు. ఈ ఫ్లాట్‌ఫామ్‌ల నిర్మాణం లోపల వైపు బోలుగా ఉండి, నీటిపై తేలియాడేందుకు సహకరిస్తుంది. అదే సమయంలో అత్యధిక బరువును మోయగలుగుతుంది.

ఒక్కో ఫెర్రో సిమెంట్ ఫ్లాట్‌ఫామ్‌పై 96 టన్నుల బరువైన యంత్రాలు నీటిపై తేలియాడుతున్నాయి. మొత్తం 4 పూలింగ్ ప్యానల్స్ వద్ద, నాలుగు ఫెర్రో సిమెంట్ ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.

ఈ సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్‌కు హైదరాబాద్‌కు చెందిన 'భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్' (బీహెచ్ఈఎల్) అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తోంది. 430 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.

రామగుండం ఎన్టీపీసీ ఫ్లోటింగ్ పవర్ ప్రాజెక్టుతో 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణలో మెరుగైన అవకాశాలు

ఫ్లోటింగ్ సోలార్ పవర్ ఉత్పత్తికి దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అధ్యయనంలో తేలింది. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు.

''తెలంగాణలో, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయి. భూ సేకరణ సమస్యలూ ఉండవు. బొగ్గు, గ్యాస్ లాంటివి వినియోగించం కాబట్టి రిజర్వాయర్ల ద్వారా సాగు, తాగు నీటి అవసరాలతో పాటు భవిష్యత్తు విద్యుత్ అవసరాలు తీరతాయి. దీంతో పర్యావరణానికి హాని ఉండదు'' అని రామగుండం ఎన్టీపీసి సీజీఎం సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు.

పలు రాష్ట్రాలకు చెందిన అధ్యయన బృందాలు ఇక్కడికి వచ్చి ప్లాంట్ పనితీరును పరిశీలించి వెళ్లాయని సునీల్ కుమార్ బీబీసీతో చెప్పారు.

కరీంనగర్ శివారులో 'లోయర్ మానేరు డ్యామ్' (ఎల్ఎండీ) లో ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల ఆధ్వర్యంలో ఇదే తరహా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణ అవకాశాలు పరిశీలన స్థాయిలో ఉన్నాయి.

నీటి మీద తేలియాడుతున్న సోలార్ ప్యానెళ్లు, విద్యుత్ తీగలు

రామగుండం ఎన్టీపీసి తేలియాడే 100 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణంతో ..

* 450 ఎకరాల భూసేకరణ అవసరం తప్పింది.

* రిజర్వాయర్ ఉపరితలంపై సోలార్ ప్యానల్స్ కప్పడం వల్ల ఏటా 32 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సూర్యరశ్మికి ఆవిరి కాకుండా పొదుపు అవుతోంది. ఇది 45 వేల కుటుంబాలు ఒక సంవత్సరం పాటు వినియోగించే నీటికి సమానం.

* 100 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన లక్షన్నర టన్నుల బొగ్గు వాడకాన్ని తగ్గించినట్లవుతోంది. తద్వారా ఏటా లక్షా11 వేల టన్నుల కర్బన ఉద్గారాలను అడ్డుకున్నట్లే.

* 100 మెగావాట్ల ఉత్పత్తి కోసం 450 ఎకరాల విస్తీర్ణంగల నీటి ఉపరితలంపై 4.48 లక్షల సౌర ఫలకాలు (సోలార్ ప్యానల్స్) పరిచారు.

* భూమిపై నిర్మించే సౌరశక్తి కేంద్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వాటి ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. అదే నీటిపై తేలియాడే ప్లాంట్‌లో నీటి చల్లదనం కలిసి వస్తుంది. తద్వారా సామర్థ్యానికి మించి అదనంగా మరో 5 శాతం మేర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ramagundam Floating Solar Plant: How the largest floating power plant works
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X