వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ చికెన్ కంటే ఎలుక మాంసం ధర ఎక్కువ... దీని రుచి ఎలా ఉంటుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎలుకలు

రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో మిగిలిన ఆహారం ఏదైనా ఉంటే ఫ్రిడ్జ్‌లోనో లేదా డబ్బాల్లోనో దాచిపెడతాం. ఎందుకంటే టేబుల్‌పైనే వదిలేస్తే ఎలుకలు లాంటి అనుకోని అతిథులు మన వంటింట్లో హడావిడి చేస్తుంటాయి.

కొంతమంది ఎలుకలను చూస్తేనే అసహ్యించుకుంటారు.

ఉదాహరణకు ఎలుకల బెడదను వదిలించుకునేందుకు న్యూయార్క్ ఇటీవల కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చింది. అయితే, అన్నిచోట్లా ఎలుకలను ఇలానే చూస్తారని అనుకోవడానికి వీల్లేదు.

కొన్ని ప్రాంతాల్లో ఎలుకలను రుచికరమైన ఆహారంగా చూస్తారు. ఏటా మార్చి 7న ఈశాన్య భారత్‌లోని ఒక మారుమూల గ్రామంలో ''యూనంగ్ ఆరాన్’’ పేరుతో ఒక ఉత్సవం నిర్వహిస్తారు.

ఇది అద్భుతమైన వేడుక. తమ ఇంటికి వచ్చే అతిథులకు ఇక్కడ ఆహారంగా ఎలుకలను వండి పెడతారు. ఇక్కడి గిరిజనులు ''బోలె బలాక్ ఉయింగ్’’ పేరుతో ఒక వంటకం కూడా చేస్తారు. ఎలుక కడుపు, పేగులు, కాలేయం, వృషణాలు, కాళ్లు, తోకకు ఉప్పు, కారం, అల్లం కలిపి దీన్ని వండుతారు.

ఇక్కడి గిరిజనులు అన్ని రకాల ఎలుకలనూ ఆహారంగా తీసుకుంటారు. మన ఇళ్లలో కనిపించే ఎలుకలతో మొదలుపెట్టి అడవి ఎలుకల వరకు అన్నింటినీ తింటారు.

ఎలుక తోక, కాళ్లు చాలా రుచికరంగా ఉంటాయని ఫిన్లాండ్‌లోని ఓలో యూనివర్సిటీకి చెందిన విక్టర్ బెన్నో మేయర్ చెప్పారు. తన పరిశోధనలో భాగంగా ఆయన చాలా మంది గిరిజనులతో మాట్లాడారు. ఎలుకలను ఆహారంగా తీసుకోవడంపై ఆయన పరిశోధన చేపడుతున్నారు.

ఎలుకలు

బావుంటుందా?

ఆ పరిశోధనలో విక్టర్ చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు. ''అన్ని మాంసాల కంటే ఎలుక మాంసమే బావుంటుంది’’అని ఆయనతో కొందరు గిరిజనులు చెప్పారట.

''పార్టీ కానక్కర్లేదు, వేడుకే ఉండనక్కర్లేదు.. ప్రత్యేక సమయం కోసం కూడా ఎదురుచూడాల్సిన పనిలేదు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మాంసం వండుకుంటాం. ఇంటికి వచ్చే అతిథులకు విందుగా దీన్ని వడ్డిస్తాం’’అని ఆయనతో గిరిజనులు చెప్పారు.

ఆ గిరిజనుల ఆహారంలో మాత్రమే ఎలుకలు భాగం కాదు, వీటిని బహుమతిగా కూడా ఇస్తుంటారు.

ఇక్కడ కొంత మంది పెళ్లిళ్లలో ఎలుకలను కట్నంగా ఇస్తారు. పెళ్లి కూతురిని అత్తారింటికి పంపేటప్పుడు ఆమెకు ఎలుకలను కూడా ఇస్తుంటారు.

''యూనంగ్ ఆరాన్’’ రోజున పిల్లలకు కూడా ఎలుకలను బహుమతిగా ఇస్తారు. కిస్మస్ రోజు పిల్లలకు బహుమతులు ఇచ్చినట్లే ఎలుకలను వారికి ఇస్తారు. బొమ్మలతో ఆడుకున్నట్లుగా వారు ఎలుకలతో ఆడుకుంటారు.

ఎలుకలు

ఎవరు వండుకుంటారు?

అసలు మూలవాసులకు ఎలుకలపై ఇంత ప్రేమ ఎలా పెరిగిందో పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే, వీటిని ఎప్పటినుంచో సంప్రదాయంగా వీరు ఆహారంగా తీసుకుంటున్నట్లు విక్టర్ చెప్పారు.

''అడవుల్లో జింకలు, మేకలు, ఎద్దులు.. ఇలా చాలా జంతువులు తిరుగుతుంటాయి. కానీ, వారికి ఎలుకలు అంటేనే ఎక్కువ ఇష్టం’’అని ఆయన వివరించారు.

నిజానికి విక్టర్ శాకాహారి. అయితే, రుచి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఎలుక మాంసాన్ని ఆయన తిన్నారు. వాసన పక్కనపెడితే, దీని రుచి ఇతర మాంసాల్లానే ఉంటుందని ఆయన చెప్పారు.

ఎలుకలను ఆహారంగా తీసుకోవడం అనేది భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అసాధారణ ఆహారాలను తీసుకుంటున్న కొంత మందితో బ్రిటిష్ టీవీ హోస్ట్ స్టీఫెన్ గేట్స్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేశారు.

దీనిలో భాగంగానే కామెరూన్‌లోని యావుండే సివార్లలో ఒక చిన్న ఎలుకల పెంపక కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

''ఈ ఎలుకలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఇక్కడి కోడి మాంసం, కూరగాయల కంటే ఇవి ఖరీదు కూడా చాలా ఎక్కువ’’అని గేట్స్ చెప్పారు.

ఎలుకలు

ఎందుకు రుచికరం?

వీటి రుచి ఎలా ఉందని అక్కడి ప్రజలు అడిగినప్పుడు.. ''నేను తిన్న మాంసాల్లో ఇదే అత్యంత రుచికరమైనది’’ అని గేట్స్ చెప్పారు.

అక్కడ ఎలుక మాంసాన్ని టమాటోలతో కలిపి వండుతారు. ''ఇది కొంచెం పంది మాంసంలా అనిపించింది’’ అని గేట్స్ వివరించారు.

''బాగా రుచికరమైన మాంసం, కొవ్వు నిండిన గ్రేవీతో నోటిలో వేసుకోగానే కరిగిపోయినట్లు అనిపించింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

ఎలుకలు

బిహార్‌లోనూ..

ఆ కార్యక్రమంలో భాగంగా బిహార్‌లోని కొన్ని దళిత వర్గాలనూ గేట్స్ కలిశారు. వారు ఇక్కడి భూసాముల పొలాల్లో పనిచేస్తుంటారు.

ఇక్కడి పొలాలకు ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటిని పట్టుకొని ఆహారంగా తినేందుకు దళితులకు ఉన్నత వర్గాల ప్రజలు అనుమతిస్తారు.

''చిన్నచిన్న ఎలుకల మాంసాం చాలా మెత్తగా, మృదువుగా ఉంటుంది. దీన్ని కోడి మాంసంలా చూడొచ్చు’’ అని గేట్స్ చెప్పారు. కానీ, ఇక్కడ ఎలుకల వెంట్రుకలతోనే అసలు ఇబ్బంది.

''ఎలుకల మాంసం లేదా కొవ్వు పాడు కాకుండా ఉండేందుకు వీటిని నిప్పుల్లో పెట్టి కాలుస్తారు. దీని వల్ల విపరీతమైన వాసన వస్తుంది. కానీ, లోపల మాంసం మాత్రం బావుంటుంది’’ అని గేట్స్ చెప్పారు.

చర్మం కిందుండే కొవ్వు, మాంసం చాలా రుచికరంగా ఉంటాయని గేట్స్ చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగానూ...

ఎలుకలను తినే సంప్రదాయం ఈనాటిది కాదు. నెబ్రాస్కా యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. చైనాలో టాంగ్ సామ్రాజ్యం (618-907) కాలం నుంచీ ఎలుకలను ఆహారంగా తీసుకునేందుకు పెంచుకునేవారు.

చిన్నచిన్న ఎలుకలను తేనెలో కలిపి టాంగ్ సామ్రాజ్యంలో ఆహారంగా తీసుకునేవారని ఆ అధ్యయనం తెలిపింది.

మరోవైపు 200 ఏళ్ల ముందువరకు న్యూజీలాండ్‌లో చాలా మంది ఇంటిలో తిరిగే ''క్యోరే’’గా పిలిచే ఎలుకలను తినేవారు.

ఈ ఎలుకల మాంసాన్ని ఇక్కడ పర్యటకులకు ఆహారంగా పెట్టేవారు. పెళ్లిళ్ల సమయంలో వీటిని కుటుంబాలు ఇచ్చిపుచ్చుకునేవి.

మరోవైపు భారత్‌తోపాటు కంబోడియా, ఇండోనేసియా, థాయిలాండ్, ఘానా, చైనా, వియత్నాంలలోని కొన్ని ప్రాంతాల్లో ఎలుకలను ఆహారంగా తీసుకుంటారని ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు గ్రాంట్ సింగెల్‌టన్ చెప్పారు.

ఎలుకల్లో రకాలు.. వాటి రుచి..

వియత్నాంలోని మెకాంగ్ డెల్టా ప్రాంతంలో తను ఆరుసార్లు ఎలుక మాంసం తిన్నట్లు సింగెల్‌టన్ చెప్పారు. రుచి విషయానికి వస్తే.. ''అన్నంతో కలిపి ఈ మాంసాన్ని తింటే.. కుందేలును తిన్నట్లే అనిపిస్తుంది’’అని ఆయన చెప్పారు.

మరోవైపు లావోస్‌, మియన్మార్‌లలోనూ ఎలుకలను ఆయన ఆహారంగా తీసుకున్నారు. లావోస్‌లోని ఉత్తర ప్రాంతాల్లో దాదాపు ఐదు రకాల ఎలుకలను ఆహారంగా తీసుకోవడాన్ని ఆయన చూశారు.

ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు ఎలుకలను ఆహారంగా తీసుకుంటారు. ఉదాహరణగా నైజీరియాను తీసుకోండి. ఇక్కడ పెద్ద ఎలుకలను ప్రజలు ఇష్టంగా తీసుకుంటారు.

గోమాంసం, చేపల కంటే ఇక్కడ ఎలుక మాంసం ధర ఎక్కువని నైజీరియా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన మోజిసోలా ఓయారిక్వా చెప్పారు. ''వాటి రుచి బావుంటుంది. వాటిని వేపుకోవచ్చు. కాల్చుకోవచ్చు. ఉడకబెట్టి తినొచ్చు’’అని ఆయన చెప్పారు.

అసలు వేరే ప్రత్యామ్నాయం లేక ప్రజలు ఈ ఎలుకలను తింటున్నారా? అంటే అలా ఏమీ లేదు. ఇష్టపూర్వకంగానే ప్రజలు ఎలుకలను తింటున్నారని గేట్స్ చెప్పారు.

మీకు చుట్టుపక్కల రెస్టారెంట్లో ఎలుక మాంసం దొరక్కపోవచ్చు. ఏదో ఒకరోజు పశ్చిమ దేశాల మెనూలో మళ్లీ ఇవి కనిపించొచ్చేమో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Rat meat costs more than chicken there... how does it taste?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X