తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు; వినియోగదారులకు శుభవార్త, నేటి నుండి ధరలిలా!!
వినియోగదారులకు చమురు సంస్థలు శుభవార్తను చెప్పాయి. ఈరోజు 2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తూ ప్రకటన చేశాయి. ప్రతి నెల ఒకటవ తేదీన పెట్రోలియం కంపెనీలు ఎల్పిజి, ఏటీఎఫ్, కిరోసిన్ తదితరాలపై ధరలను సమీక్షించి అవసరమైతే మార్పులు చేస్తాయి. ఈ మేరకు నేడు ధరలను మార్పు చేశాయి. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నాడే ఎల్పిజి సిలిండర్ల ధరలలో మార్పులు చోటుచేసుకున్నాయి. విపరీతంగా పెరిగిన ధరలను సవరించిన చమురు సంస్థలు కేవలం వాణిజ్య సిలిండర్ల ధరలలో తగ్గింపు చేశాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 92 రూపాయల వరకు తగ్గింది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే ధరలు తగ్గింపుతో కాస్త ఉపశమనం లభించింది. 14.2 కిలోల గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు గత నెలలో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా కొనసాగుతున్నాయి. గత నెలలో దేశీయ వంటగ్యాస్ మీద 50 రూపాయలు మేర ధరను పెంచాయి చమురు సంస్థలు. కాగా మార్చిలో ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను 350 రూపాయలు పెంచింది. ప్రస్తుతం 92 రూపాయలు తగ్గించింది.

వాణిజ్య అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలలో తగ్గింపు జరగడం కాస్త ఉపశమనం ఇస్తున్నా, గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలలో తగ్గింపు లేకపోవడం సామాన్య, మధ్యతరగతి ప్రజలను నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల కంటే, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలే ఎక్కువగా హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి.
ఇదిలా ఉంటే తాజాగా సవరించిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 2028 రూపాయలుగా, కలకత్తాలో 2132 రూపాయలుగా, ముంబైలో 1980 రూపాయలుగా, చెన్నైలో 2192 రూపాయల 50 పైసలుగా, హైదరాబాద్లో 2,325గా నేటి నుండి కొనసాగనుంది. ఇక 14.2 కిలోల ఎల్పిజి గృహ వినియోగాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో 1103 రూపాయలుగా, తెలుగు రాష్ట్రాల్లో 1150 రూపాయలుగా, ముంబైలో 1102 రూపాయలు, కోల్ కత్తాలో 1129 రూపాయలు, చెన్నైలో 1118 రూపాయలుగా ధర కొనసాగుతుంది. ఇక ఈ ధరలు మార్చి 1వ తేదీ నుండి అమలులోకి రాగా ఈ నెలలో కూడా ఇవే కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications