ఢిల్లీ హైవే దిగ్బంధంపై నిరసన చేస్తున్న రైతుల్లో వివాదం
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో గత 15 రోజులకుపైగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గత 14 రోజులుగా తమ ఆందోళనలతో రైతులు జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఈ నేపథ్యంలో పలువురు ఆందోళనలో పాల్గొన్న రైతులు తమ ఆందోళనలను విరమించాలని, జాతీయ రహదారుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అయితే, మరికొందరు రైతు సంఘం నాయకులు మాత్రం జాతీయ రహదారిపై వాహనాలను అడ్డుకోవాల్సిందేనని చెబుతున్నారు.

నోయిడా-న్యూఢిల్లీ హైవే తెరచుకునే ఉండగా, ఢిల్లీ-జైపూర్ సరిహద్దు రైతులు దిగ్భంధం చేశారు. రాజస్థాన్ నుంచి ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చే రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక పంజాబ్, హర్యానా రైతులు దేశ రాజధాని సరిహద్దు ప్రాంతంలోనే హైవేలపై ఆందోళలను కొనసాగిస్తున్నారు.
శనివారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అనంతరం రైతు సంఘం అధ్యక్షుడు ఠాకూర్ భాను ప్రతాప్ సింగ్.. హైవేలను బ్లాక్ చేయకుండానే ఆందోళన కొనసాగించాలని పిలుపునిచ్చారు. అయితే, యూపీ యూనిట్ చీఫ్ బీకేయూ (భాను) యోగేష్ ప్రతాప్ మాత్రం రహదారులపైనే కూర్చుని నిరసన తెలపాలని స్పష్టం చేశారు. హైవేలను తెరిచేందుకు ఆయన అంగీకరించలేదు. రహదారులపై తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.
కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రహదారులను దిగ్బంధించి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం పలు దఫాలుగా రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమైనప్పటికీ చర్చలు సఫలం కాలేదు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), మండీ వ్యవస్థను కొనసాగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
అయినప్పటికీ రైతు సంఘాల నేతలు మాత్రం చట్టాలను రద్దు చేయాలంటూ పట్టుబట్టారు. ఇందుకు కేంద్రం పెద్దలు ససేమిరా అన్నారు. రైతుల మేలు కోసం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సవరణలు కోరితే చేస్తామని, చట్టాన్ని రద్దు చేయడం కుదరదని తెలిపింది.












Click it and Unblock the Notifications