వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోహిత్ శర్మ: 35 ఏళ్ల ఈ ‘డాడీస్ ఆర్మీ’ కెప్టెన్‌ను తీసేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్... ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.

ఆడిలైడ్ మైదానంలో ఇంగ్లండ్ విజయపతాకం ఎగుర వేస్తున్న తరుణం. స్టాండ్స్‌లో కూర్చొని ఉన్న ఒక వ్యక్తి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరుగుతున్నాయి.

ఓటమి భారంతో భుజాలు కిందకు జారి పోయాయి.

కట్టలు తెంచుకుంటున్న కన్నీళ్లను తుడుచుకుంటూ పరాజయపు 'అవమానాన్ని’ జీర్ణించుకోలేక తలదించుకున్న ఆ వ్యక్తి ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

కన్నీటి పర్యంతమైన ఆ వ్యక్తి టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంగ్లండ్ మీద ఒక్క వికెట్ కూడా తీయలేక పోవడం అతని కీర్తికి కచ్చితంగా మచ్చ తెచ్చేదే.

ఒక ఆటగాడిగా రోహిత్ శర్మకు ఘనమైన చరిత్రే ఉంది. టెస్టుల్లో తనదైన ముద్రవేసిన రోహిత్ శర్మను, వన్డేలలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన వీరునిగా కొనియాడుతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు అంటే వినిపించే పేరు రోహిత్ శర్మ. ముంబయి ఇండియన్స్‌కు అతను 5 టైటిళ్లు సాధించి పెట్టాడు.

'హిట్ మాన్’ అంటూ క్రికెట్ ప్రపంచం ముద్దుగా పిలుచుకునే రోహిత్ శర్మ కన్నీరు పెట్టడం... టీం ఇండియా ఆటగాళ్లను మాత్రమే కాదు కోట్ల మంది క్రికెట్ అభిమానుల హృదయాలను సైతం కలిచివేసింది.

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ వారసునిగా

టీం ఇండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ వయసు సుమారు ఏడాది మాత్రమే.

ఇంగ్లండ్ మీద ఓటమి తరువాత ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. 35ఏళ్ల రోహిత్ శర్మ నాయకత్వంలోని టీం ఇండియా టీ20 భవిష్యత్తు ఏంటి?

వర్తమానం, గతాన్ని కొలమానంగా మాత్రమే భవిష్యత్తును అంచనా వేయగలం.

వర్తమానం చూస్తూనే ఉన్నాం. గతం కోసం కాల చక్రంలో ఒక ఏడాది వెనక్కి వెళ్దాం.

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీం ఇండియా, 2021 టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలోనే బయటకు వచ్చేసింది. దీని ఫలితంగానే విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ టీ20 కెప్టెన్ అయ్యాడు.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో అనేక టీ20 సిరీస్‌లు గెల్చుకుంది టీం ఇండియా. కొన్ని సార్లు రోహిత్ శర్మకు విశ్రాంతి కూడా ఇచ్చారు. అయినా జట్టు ఆటతీరు మీద ఎటువంటి ప్రభావం పడలేదు.

న్యూజీలాండ్, వెస్టిండీస్, శ్రీలంకల మీద క్లీన్ స్వీప్ కూడా చేసింది. విదేశాల్లో ఐర్లాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్ మీద భారత్ విజయపతాకాన్ని ఎగుర వేసింది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్‌లో జరిగిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లను సైతం టీం గెలుచుకుంది.

ఈ విజయాలు చూసి, ఇంకేం... టీం ఇండియా బాగానే ఉంది, గెలుపు గుర్రంలా దూసుకు పోతోందని చాలా మంది అనుకున్నారు. కానీ రెండు పెద్ద ఐసీసీ టోర్నమెంట్స్ గెలవడంలో టీం ఇండియా విఫలమైంది.

టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ

ఆసియా కప్... తొలి సవాల్

కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఎదురైన తొలి సవాల్... ఆసియా కప్.

యూఏఈ, ఒమన్‌లు ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది భారత్. కానీ ఆ తరువాత పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో టోర్నమెంట్ నుంచి భారత్ బయటకు రావాల్సి వచ్చింది.

రెండో పెద్ద చాలెంజ్... టీ20 వరల్డ్ కప్... ఇక్కడ కూడా సెమీఫైనల్‌లో ఇంటి దారి పట్టింది టీం ఇండియా. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీద చాలా కష్టంగా భారత్ గెలిచింది. కానీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లు ఎదురుపడినప్పుడు దారుణంగా ఓడి పోయింది.

'బ్యాటింగ్ పవర్ ప్లే’ను సరిగ్గా ఉపయోగించుకోలేక పోవడం, టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఒక్క అఫ్గానిస్తాన్ మీద మాత్రమే పవర్ ప్లేలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ బాగా ఆడారు.

భారత్ భయపడుతూ బ్యాటింగ్ చేయడమే దాని ఓటమికి కారణమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నారు. 'టీం ఇండియా టీ20లను ఇంకా 10ఏళ్ల కిందటి స్టైల్లో ఆడుతోంది. నేడు ఆ రోజులు పోయాయి’ అని కూడా ఆయన విమర్శించారు.

మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ

ఫలించని వ్యూహం

ఆరంభంలో వికెట్లను కాపాడుకోవాలి... ఆ తరువాత దూకుడుగా ఆడాలి... ఈ వ్యూహాన్ని టీం ఇండియా నమ్ముకుంది. కానీ అది ఫలించలేదు.

కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఇందుకు విమర్శలు ఎదుర్కొన్నారు.

ఏ క్రికెట్ జట్టుకైనా వరల్డ్ కప్ అనేది చాలా పెద్ద విషయం. అతి పెద్ద లక్ష్యం కూడా. సాధ్యమైనంత బెస్ట్‌గా ఆడాలని ప్రతి జట్టూ కోరుకుంటుంది. కొన్నేళ్ల ముందు నుంచే ఆ దిశగా సన్నాహాలు మొదలు పెడుతుంది.

వరల్డ్ కప్‌లో స్థాయికి తగినట్లు ఆడకపోతే ఆ తరువాత జట్టులో పెద్దపెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సంగతి టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు బాగా తెలుసు. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా ఆయనకు ఆ అనుభవం చాలానే ఉంది.

ఆ అనుభవం ఎలాంటిదో తెలియాలంటే మనం కాలంలో మరింత వెనక్కి వెళ్లాలి.

2007 వన్డే వరల్డ్ కప్...

వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన ఆ వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఘోరంగా విఫలమైంది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. అదీ బెర్ముడా మీద. 1979 తరువాత టీం ఇండియాకు అదే అత్యంత నాసిరకం ప్రదర్శన. 1979లోనూ ఒక్క మ్యాచ్ మాత్రమే భారత్ గెలిచింది.

శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మీద ఓడిపోయిన భారత్... గ్రూప్ దశలోనే 2007 వరల్డ్ కప్ నుంచి బయటకు వచ్చేసింది.

నాడు టీం ఇండియా కెప్టెన్‌గా ఉన్నది రాహుల్ ద్రావిడ్. కోచ్‌గా ఉన్నది గ్రేగ్ చాపెల్.

వరల్డ్ కప్ ఓటమి తరువాత గ్రేగ్ చాపెల్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. రాహుల్ ద్రావిడ్‌ను వన్డే టీం నుంచి తొలగించారు.

ఆ తరువాత మహేంద్ర సింగ్ ధోని రూపంలో టీం ఇండియాకు కొత్త కెప్టెన్ వచ్చాడు. జట్టులో కొత్త శక్తిని నింపి 2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్‌లను భారత్ ముద్దాడేలా చేశాడు.

అదంతా గతం... ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం.

2022 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఓడి పోయింది. సెమీఫైనల్లో అవమానకరంగా పరాజయం పాలైంది.

మరి ఇప్పుడు కూడా జట్టులో మార్పులు చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. 'గతం మాదిరిగానే ఇప్పుడు కూడా కెప్టెన్‌ను మార్చండి’ అంటూ మాజీ క్రికెటర్లు అడుగుతున్నారు.

2024 టీ20 వరల్డ్ కప్ నాటికి రోహిత్ శర్మ వయసు 37ఏళ్లకు చేరుతుంది. అతన్ని ఇంకా కెప్టెన్‌గా కొనసాగిస్తారా? అసలు అప్పటికి జట్టులో రోహిత్ శర్మకు చోటు ఉంటుందా? అని వారు ప్రశ్నిస్తున్నారు.

కాబట్టి ఎంత త్వరగా మార్పులు చేస్తే జట్టుకు అంత మంచిదనేది వారి భావన.

టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్

2021లో ఓడిన జట్టు.. 2022లో గెలుస్తుందా?

టీ20 వరల్డ్ కప్-2021లో ఆడిన జట్టే దాదాపుగా 2022 వరల్డ్ కప్‌లోనూ ఆడింది.

పాకిస్తాన్ మీద 2021లోనూ 2022లోనూ ఒకే జట్టు ఆడింది. కాకపోతే ఈసారి రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ఆడాడు. ఎందుకంటే గాయంతో రవీంద్ర జడేజా వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు కాబట్టి.

మరి 2021లో ఓడి పోయిన ఒక జట్టు 2022లో ప్రపంచ చాంపియన్ అవుతుందని అనుకోగలరా? పైగా వయసు ముదురుతున్న ఆటగాళ్లతో 'డాడీస్ ఆర్మీ’ అంటూ టీం ఇండియా పిలిపించుకుంటూ ఉంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షామీ, భువనేశ్వర్ కుమార్... వీరంతా 30ఏళ్లకు పైబడిన వారే. వీరిలో చాలా మంది వయసు 34-35 మధ్య ఉంది.

టీం ఇండియా జట్టు సగటు వయసు ఎక్కువగా ఉండటం కూడా విమర్శలకు తావిస్తోంది.

సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ మీద 10 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయినప్పుడు తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇంకాస్త ఘాటుగా వ్యాఖ్యానించాడు.

'ఎంతో టాలెంట్ కలిగిన ప్లేయర్స్ ఉన్న జట్టు, టీ20లో ఇలా ఆడటమేంటి?

అంచనాలను అందుకోవడంలో అత్యంత తక్కువ స్థాయిలో టీం ఇండియా ఉంది. ఇండియా దగ్గర మంచి క్రికెటర్లు ఉన్నారు. కానీ వారు సరిగ్గా లేరు.

తొలి 5 ఓవర్లలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కుదురుకునేందుకు ఎవరైనా అవకాశం ఇస్తారా?

పవర్ ప్లేలో పరుగులు తీయలేక పోవడాన్ని ఏమనుకోవాలి? ఇందుకు టాలెంట్ లేక పోవడం కారణం కాదు ఆ రకమైన మానసిక స్థితి కొరవడటమే’ అని వాన్ విమర్శించారు.

యజువేంద్ర చాహల్

లెగ్ స్పిన్నర్... తీరని లోటు

వ్యూహాలను రచించడంలో రోహిత్ శర్మ విఫలమయ్యాడు అనేదానికి టీం ఇండియా ఓటములు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

పవర్ ప్లేలో పరుగులు చేయలేక పోవడంతోపాటు లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను ఆడించకపోవడం కూడా ఇండియా మీద బాగా ప్రభావం చూపింది. ఈ టోర్నమెంట్‌లో అదిల్ రషీద్, షాదాబా ఖాన్ వంటి లెగ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.

సెమీఫైనల్‌లో లెగ్ స్పిన్నర్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. 'భారత్‌కు చాలా మంచి లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. కాకపోతే మైదానంలో లేడు’ అని కామెంట్రి చెబుతున్న రవి శాస్త్రి అన్నారు.

అయితే కెప్టెన్‌ను మార్చాల్సిన పని లేదని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నారు. జట్టు పరిస్థితి మెరుగు పడటానికి ఆయన మూడు సూచనలు చేశారు.

ఒకటి... ఓపెనర్లు దూకుడుగా ఆడటం.

రెండు... జట్టులో ఒక లెగ్ స్పిన్నర్ ఉండాలి.

మూడు... వేగంగా బంతిని విసరగల మంచి ఫాస్ట్ బౌలర్ కావాలి.

ఇర్ఫాన్ పఠాన్ చేసిన సూచనలు విలువైనవి అని చెప్పడంలో సందేహం లేదు. కానీ 2024 వరకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడా అనేది మాత్రం అనుమానమే.

టెస్టులు, వన్డేలు, టీ20లకు వేరువేరు కెప్టెన్లు ఉండాలని మరికొందరు భావిస్తున్నారు.

ఇక న్యూజీలాండ్ టూర్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించారు. అంటే టీం ఇండియాలో మార్పులు మొదలు అయ్యాయని వారు చెబుతున్నారు.

అందుకే కొత్త కెప్టెన్ వస్తారా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నకాదు. ఆ కొత్త కెప్టెన్‌ను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు అనేదే అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

English summary
Rohit Sharma: Why are you demanding the removal of this 35-year-old 'Daddy's Army' captain?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X