రోహతక్ ఘటన: ఉద్యోగం కోల్పోతున్న ఈవ్ టీజర్లు, కొత్త ట్విస్ట్
రోహతక్: తమను వేధిస్తున్న వారికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు బుద్ధి చెప్పిన సంఘటన హర్యానా రాష్ట్రంలోని రోహతక్‌లో నాలుగు రోజుల క్రితం జరిగిన విషయం తెలిసిందే. ఆ అక్కాచెల్లెళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నజారానా కూడా ప్రకటించింది. వారిని ముఖ్యమంత్రి ఖట్టార్ రిపబ్లిక్ దినోత్సవం నాడు సన్మానించనున్నారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో నిందితుల ఉద్యోగాలు ఊడిపోయాయి. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు ఇటీవలే ఆర్మీ ఫిజికల్ టెస్టులో ఉత్తీర్ణులయ్యారు. ఈ సంఘటన నేపథ్యంలో వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్మీ నిరాకరించింది. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ విషయమై నివేదికను కోరారు.
నిందితుల్లో ఇద్దరు హర్యానాలోని ఝాజీగర్ ఆర్మీ రిక్రూట్మెంట్‌లో పాల్గొన్నారు. వారిని రాత పరీక్షలకు సమ్మతించమని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఈవ్ టీజింగ్‌ను ఆపనందుకు బస్సు డ్రైవర్, కండక్టర్‌లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

గ్రామస్తుల ట్విస్ట్
టీజ్ చేసిన ముగ్గురు యువకులను చితకబాదినట్లుగా ఆ అమ్మాయిలు చెబుతుంటే, నిందితుల గ్రామానికి చెందిన వారు మాత్రం మరో రకమైన వాదన వినిపిస్తున్నారు. నిందితులను కుల్దీప్, మోహిత్, దీపక్‌లుగా గుర్తించారు. వారు కన్సాలా గ్రామస్తులు.
ఈ గ్రామస్తులు కొందరు యువకులకు అండగా నిలిచారు. అసలు వారు ఈవ్ టీజింగ్ చేయలేదని, సీట్ల విషయంలో మాత్రమే గొడవ వచ్చిందని పలువురు చెబుతున్నారు. యువకుల పైన ఈవ్ టీజింగ్ కేసు సరికాదని, అది అవాస్తవమంటున్నారు.
బస్సులోని సీట్ల విషయంలో గొడవ వచ్చిందని చెబుతున్నారు. ఆ సీట్లను బాయ్స్‌కు కేటాయించారని, ఈ విషయంలో అమ్మాయిలకు, వీరికి మధ్య వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు. ఆ ముగ్గురు యువకులను 24 గంటల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు యువకులను కోర్టులో ప్రవేశ పెట్టారు. వారికి కోర్టు డిసెంబర్ 6 వరకు రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications