వంద కోట్ల వసూల్‌పై పార్లమెంటులో దుమారం- ఉద్ధవ్ రాజీనామా, కేంద్ర దర్యాప్తు డిమాండ్లు
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తనను నెలకు వందకోట్ల రూపాయలు వసూలు చేయమన్నారంటూ బదిలీ అయిన ముంబై పోలీసు అధికారి పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలు ఇవాళ పార్లమెంటు ఉభయసభల్ని కుదిపేశాయి. ఉదయం ఇరు సభలు సమావేశం కాగానే బీజేపీ ఎంపీలు దీనిపై చర్చకు పట్టుబట్టాయి. విపక్షాలు అడ్డుతగలడంతో బీజేపీ ఎంపీలకూ వారికీ మధ్య కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ముకేశ్ అంబానీ ఇంటి వద్ద కుట్ర కేసులో దర్యాప్తు సరిగా చేయట్లేదని మహారాష్ట్ర సర్కారు బదిలీ చేసిన పరమ్ బీర్ సింగ్... ఏకంగా హోంమంత్రిని టార్గెట్ చేస్తూ వంద కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు. దీన్ని ఇవాళ పార్లమెంటులో లేవనెత్తిన బీజేపీ ఎంపీలు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ధాక్రే రాజీనామాకు డిమాండ్ చేశారు. అంతే కాదు ఈ వ్యవహారంపై కేంద్ర సంస్ధలతో దర్యాప్తు జరిపించాలని కూడా కోరారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరుసభలూ వాయిదా పడ్డాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం అనిల్ దేశ్‌ముఖ్ పేరును మాత్రమ బయటపెట్టి అసలు దోషుల్ని కాపాడుతోందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. నిజానిజాలు నిగ్గుతేలాలంటే కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విచారణ అవసరమన్నారు. ముంబై ఒక్క చోటే నెలకు వందకోట్లు వసూలు చేస్తుంటే మహారాష్ట్ర అంతా కలిపి ఎంత వసూలు చేస్తున్నారో బయటపెట్టాలని ఈశాన్య ముంబై ఎంపీ మనోజ్ కొటక్ డిమాండ్ చేశారు. దీనికి కౌంటర్‌గా మాట్లాడిన శివసేన ఎంపీలు, ప్రభుత్వ రంగ సంస్ధల సీఎస్ఆర్ నిధుల్ని సర్దార్ పటేల్ విగ్రహం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. పీఎం కేర్స్‌కు కూడా ఈ నిధులు మళ్లించారని వారు కౌంటర్ ఇచ్చారు. పరంబీర్ సింగ్ లేఖపై తమను ప్ఱశ్నిస్తున్న వారంతా అవినీతి పరులే అని వారు ఆరోపించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీల వాదనకు కౌంటర్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వడం లేదని శివసేన ఎంపీలు వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications