విజయ్ వల్ల పెద్ద మార్పు..? శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఉత్సాహంగా జరుగుతుండగా, నటుడు శరత్‌కుమార్ తన భార్య రాధిక, కుమారుడు రాహుల్‌తో కలిసి చెన్నై కొట్టివాక్కంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నెరవేర్చి.. వంద శాతం ఓటింగ్ తప్పనిసరి అని నొక్కిచెప్పారు. తన కుమారుడు తొలిసారి ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు.
'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీని స్థాపించి, తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్న విజయ్ గురించి మీడియా ప్రశ్నించగా, శరత్ కుమార్ ఆగ్రహంగా స్పందించారు. "నేను ఓటు వేయడానికే వచ్చాను. ఎవరి గురించీ మాట్లాడటానికి కాదు" అని కటువుగా బదులిచ్చి నిష్క్రమించారు. ఈ ఘటన ఇద్దరి మధ్య పాత రాజకీయ, సినీ విభేదాలను మరోసారి గుర్తుచేసింది.
శరత్‌కుమార్ గతంలో 2026లో ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు. విజయ్ రాజకీయ ప్రవేశంపై చర్చలు సాగగా "ఎవరైనా పార్టీ ప్రారంభించవచ్చు, కానీ ప్రజలు ఎవరిని ఆమోదిస్తారనేది ముఖ్యం" అని పరోక్షంగా విమర్శించారు. 'వారిసు' ఆడియో వేడుకలో విజయ్ ను 'సూపర్ స్టార్' అని ప్రశంసించినప్పటికీ, రాజకీయ పోటీతో ఆయన వైఖరి మారిందని విశ్లేషకులు భావిస్తారు.
నటుడి కీర్తి రాజకీయ విజయానికి సరిపోదని, అనుభవం ముఖ్యమని, తాను దశాబ్దాలుగా రంగంలో ఉన్నానని విజయ్ రాజకీయ ప్రవేశాన్ని అప్పట్లో తక్కువ చేసి మాట్లాడారు. ప్రస్తుతం బీజేపీ కూటమి తరఫున ప్రచారం చేస్తున్న శరత్ కుమార్, విజయ్ రాజకీయ ఎదుగుదలపై ప్రశ్నలను తరచుగా దాటవేస్తుంటారు.
విజయ్‌పై శరత్‌కుమార్ చేసిన కొన్ని కీలక విమర్శలను పరిశీలిద్దాం. ఇటీవల కరూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఆగ్రహంగా మాట్లాడుతూ, "విజయ్ ఇంకా పూర్తిస్థాయి నాయకుడిగా ఎదగలేదు" అని, కేవలం అభిమాన బలంతో రాజకీయాల్లో ఏమీ సాధించలేమని విమర్శించారు.
విజయ్ 'TVK' సదస్సులో నాయకులను సంబోధించిన తీరుపైనా శరత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానిని 'మిస్టర్', ముఖ్యమంత్రిని 'అంకుల్' అని పిలవడం రాజకీయ మర్యాద కాదన్నారు. అలాగే, విజయ్ 'సింహం' ఉపమానాన్ని ఎగతాళి చేస్తూ, "సింహం సింహంగానే ఉండాలి, నిద్రపోకూడదు" అని చురక అంటించారు.
"గతంలో ఉచిత పథకాలను వ్యతిరేకించి, ఇప్పుడు వాటినే ఎందుకు తెస్తున్నారు? ఇదేనా మీ ప్రజాస్వామ్యం?" అని విజయ్‌ను శరత్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. 2026 శాసనసభ ఎన్నికల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ వల్ల పెద్ద మార్పు లేదా గణనీయమైన ప్రభావం ఉండదని బీజేపీ సీనియర్ నాయకుడిగా ఆయన స్పష్టం చేశారు.

సినిమా పేరు ప్రఖ్యాతులు రాజకీయ రంగం వేరని శరత్ కుమార్ నొక్కిచెప్పారు. "రాజకీయాలకు సుదీర్ఘ అనుభవం అత్యంత ముఖ్యం. నేను 30 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నాను. కానీ విజయ్ ఇప్పుడే మొదటి అడుగు వేస్తున్నారు" అంటూ విజయ్ అనుభవరాహిత్యాన్ని పరోక్షంగా ఎత్తి చూపారు.












Click it and Unblock the Notifications