శశికళకు ఎమ్మెల్యేలు షాకిస్తారా?: మెరీనా బీచ్‌లో బలప్రదర్శన
అన్నాడియంకె శాసనసభ్యులు శశికళకు మద్దతు ఇస్తారా అనేది ప్రశ్నగా మారింది. మెరీనా బీచ్‌లో అమ్మ సమాధి వద్ద ఆమె బలప్రదర్శనకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఇప్పటి వరకు శశికళను చిన్నమ్మగా ఆదరించి, గౌరవించిన శాసనసభ్యులు ఇప్పుడు శశికళ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం పది గంటలకు అన్నాడియంకె ఎమ్మెల్యేల భేటీ ఉంటుందని చెబుతూ, హాజరు కావాలని శశికళ ఆదేశాలు జారీ చేశారు.
సమయానికి సగం మంది శానససభ్యులు మాత్రమే వచ్చారు. ప్రస్తుతానికి 70 మంది శానససభ్యుల దాకా వచ్చినట్లు సమాచారం. సమావేశం ముగిసిన తర్వాత శశికళ మెరీనా బీచ్‌కు వెళ్లి అమ్మ సమాధి వద్ద నివాళులు అర్పించే అవకాశం ఉంది. అక్కడే ఆమె తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేయనున్నారు.
తమకు 130 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని శశికళ వర్గీయులు అంటున్నారు. అలాంటప్పుడు పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చేవారి సంఖ్య వేళ్ల మీద లెక్కించేంత మాత్రమే ఉంటుంది. పోయెస్ గార్డెన్‌లో శశికళ మంత్రాంగం జరుపుతున్నారు. తాను బలపరీక్షకు సిద్ధమని పన్నీర్ సెల్వం ఎలా ప్రకటించారనే విషయంపై చర్చ సాగుతోంది.

తానే తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని శశికళ ఇప్పటికీ ధీమాగా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని పాలించేది తానేనని ఆమె అన్నారు. గవర్నర్ తన చేత ప్రమాణం చేయిస్తారని శశికళ అంటున్నారు. పన్నీర్ సెల్వానికి ముగ్గురు శాసనసభ్యులు మాత్రమే మద్దతు ఇస్తున్నారని శశికళ వర్గీయులు చెబుతున్నారు.
తాము అన్నాడియంకె వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని డిఎంకె ఎంపి కనిమొళి అన్నారు. రాజకీయ అస్థిరత ఏర్పడిందని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications