సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు.. ఐదు దశాబ్దాల మానవతా మహాయజ్ఞం..
ఈ కథనం ఒక గ్రామం గురించి మాత్రమే కాదు.. మానవతా దృక్పథానికి, నిస్వార్థ సేవకు ప్రపంచ వేదికైన తరుణం గురించి. భారతరత్న సర్ ఎం. విశ్వేశ్వరయ్య జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర భూమిలో, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సంపూర్ణ అనుగ్రహంతో వికసించిన 'సత్యసాయి గ్రామం' నేటికి 50 వసంతాల సార్థక ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. కర్ణాటకలోని నందిగిరి పాద ప్రాంతంలో ఉన్న ముద్దేనహళ్లిలో ఐదు దశాబ్దాల క్రితం ఓ చిన్న గురుకుల పాఠశాలగా అంకురార్పణ చేసిన ఈ ప్రయాణం, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆసరాగా నిలిచే మహత్తర మానవతా ఉద్యమంగా రూపాంతరం చెందింది.
'అన్ననవరు'గా కర్ణాటక ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఆయన, విద్య ద్వారానే సమాజ సంస్కరణ సాధ్యమని గట్టిగా విశ్వసించారు. అందులో భాగంగానే 1960లో 'లోకసేవా వృంద'ను స్థాపించి, 1961లో అలికెలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు. ఆ తర్వాత గురువు, దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో ముద్దేనహళ్లిలోనూ విద్యా సంస్థల విస్తరణకు బాటలు వేశారు. 1973లో బాబా స్వయంగా ఈ ప్రాంగణానికి 'సత్యసాయి గ్రామం' అని నామకరణం చేయడం ఈ ప్రాంతం దైవికతకు నిదర్శనంగా నిలిచింది.

తొలినాళ్లలో కేవలం 27 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యా సంస్థ, 1976లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి అప్పటి అవిభజిత కోలార్ జిల్లాలోనే చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ అందిస్తున్న విద్య పూర్తిగా నిస్వార్థమైనది, విలువలతో కూడుకున్నది.
1977లో మడియాల నారాయణ భట్ అకస్మాత్తుగా మరణించినప్పటికీ, ఆయన ఆశయాలను భగవాన్ సత్యసాయి బాబా తన చేతుల్లోకి తీసుకుని ఈ సంస్థను మరింత ముందుకు నడిపించారు. బాబా మార్గదర్శకత్వంలో ఇక్కడ మానవ విలువలకు పెద్దపీట వేస్తూ విద్యార్థులను భావి భారత్ పౌరులుగా తీర్చిదిద్దే సంప్రదాయం బలపడింది.
బాబా భౌతిక దేహ వియోగం తర్వాత, వారి మార్గదర్శకంలోనే నడిచిన సద్గురు శ్రీ మధుసూదన సాయి ఈ సేవా ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆయన నాయకత్వంలో సత్యసాయి గ్రామం 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్'కు ప్రపంచ ప్రధాన కేంద్రంగా అవతరించింది. నేడు ఈ గ్రామం కేవలం విద్యకే పరిమితం కాకుండా, ఉచిత వైద్యం, పౌష్టికాహార పంపిణీ వంటి బృహత్తర కార్యక్రమాలతో సుమారు 100 దేశాలకు తన సేవలను విస్తరించింది. ముద్దేనహళ్లి నేడు జాతి, కుల, మత భేదాలకు అతీతంగా 'మినీ భారత్' స్ఫూర్తిని చాటుతోంది.
సత్యసాయి గ్రామంలో అడుగుపెడితే కోటి మందికి పైగా చిన్నారులకు ఉచిత అల్పాహారాన్ని అందిస్తున్న 'సాయి ష్యూర్' కేంద్రం నుంచి మొదలుకొని, వేలాది మంది రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్న అత్యాధునిక శ్రీ మధుసూదన సాయి ఆసుపత్రి వరకు ప్రతి అడుగులోనూ సేవా తత్పరత కనిపిస్తుంది.
గోశాల, ప్రేమసదనం, శ్రీ సత్యసాయి మానవ అభ్యుదయ విశ్వవిద్యాలయం వంటివి ఆధ్యాత్మికతకు, ఆధునిక విద్యకు అద్దం పడుతున్నాయి. గతంలో బాబా 100వ జయంతి సందర్భంగా నిర్వహించిన విశ్వ సాంస్కృతిక మహోత్సవం, సాయి సింఫనీ ఆర్కెస్ట్రా ద్వారా ఈ గ్రామం రెండు గిన్నిస్ రికార్డులను సైతం సొంతం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించింది.
స్వర్ణోత్సవాల సంబరాల వేళ, సమాజంలో మార్పు కోసం సద్గురు శ్రీ మధుసూదన సాయి చేపడుతున్న 'కంపాషన్ ఇన్ యాక్షన్' కార్యక్రమాలు విశేష స్పందనను పొందుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా, నేటి విద్యా విధానంలో కార్పొరేట్ అవసరాలకు తగినట్లుగా నైపుణ్యాధారిత స్వల్పకాలిక కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. విద్యాసంస్థలు ఎప్పటికీ వ్యాపార కేంద్రాలు కారాదని, విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆయన చేసిన దిశానిర్దేశం ఆలోచింపజేసేలా ఉంది.
ఐదు దశాబ్దాల క్రితం కొద్ది మంది నిస్వార్థ త్యాగజీవుల కలగా రూపుదిద్దుకున్న సత్యసాయి గ్రామం.. నేడు కోట్లాది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఒక మానవతా మహాయజ్ఞంగా పరిణమించింది. శ్రీ మడియాల నారాయణ భట్ విత్తిన సేవా బీజం, భగవాన్ సత్యసాయి బాబా సంకల్ప బలం, సద్గురు శ్రీ మధుసూదన సాయి అంకితభావం కలగలిసి ఈ ప్రాంగణాన్ని విశ్వశాంతికి కేంద్ర బిందువుగా మార్చాయి. తరాలు మారినా, కాలం మారినా మానవ సేవే మాధవ సేవ అనే అమర సందేశాన్ని ఈ సత్యసాయి గ్రామం ప్రపంచానికి నిరంతరం చాటుతూనే ఉంటుంది.














Click it and Unblock the Notifications
