బిల్కిస్ బానో దోషుల విడుదలపై సుప్రీం ఫైర్-ఏంటీ పక్షపాతం ? ఇరుక్కున్న గుజరాత్ సర్కార్..!
2002లో గుజరాత్ లో జరిగిన మత ఘర్షణలను అడ్డుపెట్టుకుని బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె మూడేళ్ల చిన్నారిని, కుటుంబ సభ్యుల్ని హతమార్చిన ఘటనలో దోషుల్ని గుజరాత్ సర్కార్ వదిలేయడంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషుల విడుదలలో గుజరాత్ సర్కార్ అనుసరించిన వైఖరిపై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. ప్రభుత్వానికి అనేక కీలక ప్రశ్నలు సంధించింది. దీంతో ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానం చెప్పలేక ఇరుకునపడ్డారు.
2002 అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబాన్ని హతమార్చిన కేసులో దోషులను అసందర్భంగా విడుదల చేయడంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు.. గుజరాత్ ప్రభుత్వాన్ని కడిగేసింది. బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న వారిని ముందస్తుగా విడుదల చేసే విషయంలో గుజరాత్ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించినట్లు సుప్రీంకోర్టు తేల్చింది. దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారని, అటువంటి పరిస్థితిలో 14 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత వారిని ఎలా విడుదల చేయగలిగారని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఇతర ఖైదీలకు ఎందుకు ఇలా విడుదలలో ఉపశమనం ఇవ్వలేదని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేరస్థులకు ముందస్తు విడుదల ప్రయోజనాన్ని ఎంపిక చేసి మరీ ఎందుకు అందించారని న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం నిలదీసింది. 14 ఏళ్ల తర్వాత కరుడుగట్టిన నేరస్థులను సంస్కరించే అవకాశం ఇవ్వాలన్న నిబంధనను వీరితో పాటు ఇతర ఖైదీలకు ఎంతవరకు వర్తింపజేస్తున్నారని కూడా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
సంస్కరించి తిరిగి సంఘటితం చేసే అవకాశం అందరికీ ఇవ్వాలని, ఇది అసలు అమలవుతుందా అని అడిగింది.
బిల్కిస్ దోషుల కోసం జైలు సలహా కమిటీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, వివరాలను అందించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గోద్రా కోర్టులో విచారణ జరగనప్పుడు కేంద్రం అభిప్రాయాన్ని ఎందుకు కోరారని కూడా ప్రశ్నించింది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదలైన 11 మందికి మహారాష్ట్రలోని కోర్టు శిక్ష విధించింది. వారిని దోషులుగా నిర్ధారించిన న్యాయమూర్తి దోషులను విడుదల చేయాలా అనే రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నకు ప్రతికూలంగా స్పందించారు.
2002లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో 59 మంది కరసేవకులు మరణించిన తర్వాత హింసాత్మక ఘటనలు సంభవించిన రాష్ట్రంలో న్యాయమైన విచారణ సాధ్యం కాదని భావించినందున కేసు విచారణను గుజరాత్ నుండి మహారాష్ట్రకు మార్చారు.
గుజరాత్ ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. సాధారణంగా కోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమన్నారు. అయితే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, దీనిపై అన్ని రాష్ట్రాలు సమగ్ర సమాచారం ఇవ్వాలని కోర్టుకు తెలిపారు. దోషులను చట్ట ప్రకారం విడుదల చేశామని చెప్పారు. 2008లో దోషులుగా తేలినందున, 1992 పాలసీ ప్రకారం వారిని పరిగణించాల్సి వచ్చిందన్నారు. గత విచారణలో బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications