కాళికాదేవికి ఆత్మార్పణ.. అరికందమ్.. వెయ్యేళ్ళనాటి విగ్రహం!!
భారతదేశంలో ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. ఎన్నో ప్రాచీన నాగరికతలు, పురాతన కాలంలోని అనేక ఆచారాలు అనేక సందర్భాలలో వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో జరుగుతున్న తవ్వకాలలో భారతీయ సంస్కృతికి చెందిన ఎన్నో అపురూపమైన శిల్పాలు లభ్యమవుతున్నాయి. నాటి ఘటనలను, అప్పటి సంస్కృతిని అవి కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి. అనేక అపురూప శిల్పాలు చరిత్ర అధ్యయనానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
అటువంటి శిల్పమే తమిళనాడు రాష్ట్రంలోని శివ గంగ జిల్లాలో లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లాలో ఒక ప్రాచీన విగ్రహం లభ్యమైంది. ఓ వ్యక్తి తన తలను తానే నరుక్కుంటున్నట్టుగా ఉన్న ఈ విగ్రహం వెయ్యేళ్ల క్రితం నాటిదని భావిస్తున్నారు. ఈ విగ్రహాన్ని చోళపురం వద్ద గుర్తించారు. చోళపురం, నాలు కొట్టై గ్రామం మధ్యలో ఉన్న అమ్మన్ ఆలయం లో ఈ విగ్రహాన్ని గుర్తించారు.

ప్రస్తుతం లభించిన ఈ విగ్రహం రెండు అడుగుల ఎత్తు, ఒకటిన్నర అడుగుల వెడల్పుతో ఉంది. ఈ విగ్రహం లో అరికందమ్ కు పాల్పడే వ్యక్తి తన ఎడమచేతితో జుట్టును పట్టుకుని, కుడి చేతి కత్తి తో తల నరుక్కుంటున్నట్టుగా ఉంది. ఈ విగ్రహాన్ని బట్టి అప్పటి ఆచారాన్ని అధ్యయనం చేస్తున్నారు.
అది తమిళనాడు సంస్కృతిలో భాగమైన అరికందమ్ గా భావిస్తున్నారు. తమిళ సంస్కృతిలో అరికందమ్ అంటే కాళికామాత కు ఆత్మార్పణ చేసుకోవడం.. ప్రాణత్యాగం చేసుకునే వ్యక్తి తన తల నరుక్కోవడాన్ని అరికందమ్ అని చెబుతారు. అయితే ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి తన శరీరాన్ని తొమ్మిది ముక్కలుగా నరకడాన్ని నవకందమ్ అంటారు.
ప్రస్తుతం లభ్యమైన వెయ్యేళ్ల నాటిది అని చెప్పబడుతున్న విగ్రహం కూడా ఓ వ్యక్తి అరికందమ్ కు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తుంది. పూర్వం యుద్ధంలో గెలిచినా, లేక రోగాల బారిన పడి కోలుకున్నా అమ్మవారికి ఆత్మార్పణ చేసి, ఆత్మబలిదానంతో మొక్కు తీర్చుకునేవారు, ఈ క్రమంలోనే అరికందమ్ అప్పట్లో ఆచారంగా ఉండేది. ఇప్పుడు ఈ విగ్రహం దొరకటంతో అప్పటి ఆచారం చర్చకు వచ్చింది.












Click it and Unblock the Notifications