ఇండియా కూటమికి భారీ షాక్: బీజేపీ ఖాతాలోకి ఛండీగఢ్ మేయర్, కుట్రేనంటూ కేజ్రీవాల్ ఫైర్
ఛండీగఢ్: ఇండియా కూటమికి మరో భారీ షాక్ తగిలింది. చండీగఢ్ మేయర్ ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి పరాజయం పాలయ్యారు. ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన ఈ ఎన్నికలో బీజేపీ మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్ విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి కులదీప్ కుమార్‌పై మనోజ్ గెలుపొందారు.
పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం ఛండీగఢ్ మేయర్ ఎన్నిక జరిగింది. భారీ భద్రత నడుమ జరిగిన ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీ దక్కించుకుంది. అయితే, చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థి మనోజ్ సోంకర్ గెలుపొందడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

బీజేపీ మోసపూరితంగా మేయర్ పదవిని దక్కించుకుందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిదని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఇక పోలైన 36 ఓట్లలో మనోజ్ సోంకర్‌కు 16 ఓట్లు దక్కాయి. చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్ ఎక్స్-అఫీషియో మెంబర్‌గా బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు.

ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థికి 12 ఓట్లు లభించగా, 8 ఓట్లు చెల్లుబాటు కాలేదు. పొత్తులో భాగంగా మేయర్ పదవి కోసం ఆమ్‌ఆద్మీ పార్టీ, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టాయి. అయితే, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు నిరాకరించారు. దీంతో బీజేపీ అభ్యర్థి రాజేందర్ కుమార్ డిప్యూటీ మేయర్‌గా గెలుపొందారు.
కాగా, చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 35 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 14 మంది సభ్యులుండగా, ఆమ్ ఆద్మీ పార్టీకి 13, కాంగ్రెస్ పార్టీకి 7, శిరోమణి అకాళీదళ్ కు ఒక సభ్యుడు ఉన్నారు. అయితే, ఛండీగఢ్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. దిగజారుడు రాజకీయాలతో బీజేపీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుందని విమర్శించారు.












Click it and Unblock the Notifications