పిచ్చి సిఎం, నా పెళ్లి సెలవే రద్దయింది: కేజ్రీవాల్‌పై షిండే
ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి ముఖ్యమంత్రి అని అర్థం వచ్చేలా మరాఠీలో వ్యాఖ్యానించారు. షిండే మహారాష్ట్రంలోని హింగోలి ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేజ్రీవాల్ పేరు ప్రస్తావించకుండానే ఆయన పైన దుమ్మెత్తి పోశారు. ఈ పిచ్చి ముఖ్యమంత్రి కారణంగా తాను వేలాది మంది పోలీసులను సెలవులు రద్దు చేసి మరీ బందోబస్తుకు నియమించవలసి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను పోలీసుగా పని చేసినప్పుడు అల్లర్ల కారణంగా తన పెళ్లికి పెట్టుకున్న సెలవు కూడా రద్దయిందని చెప్పారు. ఇప్పుడు ఓ పిచ్చి ముఖ్యమంత్రి ధర్నా కారణంగా పోలీసుల సెలవులు రద్దు చేయాల్సి వచ్చిందని విమర్శించారు. షిండే చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్, ఎఎపి రెండు రోజుల పాటు ఢిల్లీలో రోడ్డు పైన ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. సోమవారం ధర్నాకు దిగిన కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం విరమించుకున్నారు. ఒకరోజు రాత్రి ఆయన అక్కడే రోడ్డు పైనే పడుకున్నారు.












Click it and Unblock the Notifications