వాడి పారేసిన మాస్కులతో పరుపుల తయారీ ... మహారాష్ట్ర జల్గావ్ లో మాస్క్ రాకెట్ గుట్టు రట్టు
అసలే కరోనాతో తీవ్రంగా దెబ్బ తిన్న మహారాష్ట్రలో షాకింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వాడేసిన మాస్కులతో పరుపులు తయారు చేస్తున్న ఓ కర్మాగారాన్ని మహారాష్ట్రలో పోలీసులు సీజ్ చేశారు. యూనిట్ యజమానిపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను చూస్తే

జల్గావ్ జిల్లాలో నిర్వహిస్తున్న మ్యాట్రెస్ కర్మాగారంలో దారుణం .. పరుపుల్లో పత్తికి బదులుగా వాడేసిన మాస్కులు
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నిర్వహిస్తున్న మ్యాట్రెస్ కర్మాగారంలో పరుపులు తయారీకి పత్తికి ,పీచు వంటి ఇతర మెటీరియల్స్ కు బదులుగా వాడి పారేసిన మాస్కులను వినియోగిస్తున్నారు. రాజధాని ముంబైకి ఈశాన్యంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్గావ్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడిసి) లోని పోలీస్ స్టేషన్‌లోని అధికారులకు మహారాష్ట్ర మ్యాట్రస్ సెంటర్‌లో ఈ దారుణాలు జరుగుతున్నట్టు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు

వాడేసిన మాస్కులతో పరుపుల తయారీని గుర్తించిన అధికారులు , ఫ్యాక్టరీ సీజ్ , కేసు నమోదు
మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోని కుసుంబ గ్రామంలోని కర్మాగార ప్రాంగణాన్ని అధికారులు సందర్శించి అక్కడ జరుగుతున్న దందా చూసి షాక్ కు గురయ్యారు . వాడి పారేసిన మాస్కులతో పరుపులను నింపినట్లు వారు గుర్తించారు . దీంతో అక్కడ జరుగుతున్న దందాపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్న అధికారులు ఫ్యాక్టరీ యజమాని అంజాద్ అహ్మద్ మన్సూరి పై కేసు నమోదు చేశారు . ఇదే విషయాన్ని అదనపు పోలీసు సూపరింటెండెంట్ చంద్రకాంత్ గవాలి చెప్పారు.

వాడి పారేసిన మాస్క్ ల కుప్పలను తగలబెట్టిన పోలీసులు
ఇక ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లుగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు.
ఫ్యాక్టరీ ప్రాంగణమంతా వాడి పారేసిన మాస్క్ ల కుప్పలను గుర్తించిన పోలీసులు వాటిని తగులబెట్టారు. ఫ్యాక్టరీలో ఫైల్స్ ను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భారతదేశంలో మాస్కుల ఉత్పత్తి 2020 మార్చిలో రోజుకు 1.5 కోట్ల యూనిట్ల సామర్థ్యానికి పెరిగింది. భారతదేశంలో ఇప్పటికే ఒత్తిడికి గురైన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థపై మహమ్మారి భారం పడుతోంది.

బయో మెడికల్ వ్యర్దాలతో పరుపుల తయారీ , మార్కెటింగ్ పై దర్యాప్తు
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం, జూన్ మరియు సెప్టెంబర్ 2020 మధ్య మాత్రమే గ్లోవ్స్ మరియు ఫేస్ మాస్క్‌లతో సహా 18,000 టన్నుల కోవిడ్ -19 సంబంధిత బయో మెడికల్ వ్యర్థాలను ఉత్పత్తి చేసింది.
ఇక ఈ బయోమెడికల్ వ్యర్థాలను పరుపులు తయారుచేయడానికి వినియోగించడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ తయారు చేసిన పరుపులు ఎక్కడెక్కడ మార్కెటింగ్ చేశారు అన్నదానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దందా ఎంత కాలంగా సాగుతుంది అన్న దానిపై పోలీసుల దర్యాప్తు
ఏది ఏమైనా అసలే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వాడి పారేసిన మాస్కులతో పరుపులు తయారుచేసి విక్రయించడం షాక్ కి గురి చేస్తుంది. అది అత్యంత దారుణంగా దెబ్బ తిన్న మహారాష్ట్రలో చోటుచేసుకోవడం మరీ ఆందోళన కలిగిస్తుంది . ఇక ఈ దందా ఎంత కాలంగా సాగుతుంది అన్న దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు .












Click it and Unblock the Notifications