SIR Shock: ఎన్నికల కమిషనర్ కే షాక్- లిస్ట్ లో కేంద్రమంత్రి, టాప్ బ్యూరోక్రాట్లు, అద్వానీ..!
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR) సెగ ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి దేశంలో టాప్ బ్యూరోక్రాట్లు, సీనియర్ రాజకీయ నేతల కుటుంబాల వరకూ పాకింది. ఇందులో ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ సుఖ్ బీర్ సింగ్ సందూ కూడా ఉండటం విశేషం. ఆయనతో పాటు కేంద్రమంత్రి జైశంకర్, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ, కపిల్ సిబల్ వంటి వారు కూడా ఎస్ఐఆర్ తాజా నోటీసులు అందుకున్నారు. దీంతో ఎస్ఐఆర్ వ్యవహారం మరోసారి జాతీయ స్ధాయిలో చర్చనీయాంశంగా మారుతోంది.
ఎస్ఐఆర్ లో తాజాగా నోటీసులు అందుకున్న వారిలో దేశంలో టాప్ బ్యూరోక్రాట్లు, కేంద్రమంత్రులు, ఎంపీలు, రాజకీయ ప్రముఖులు ఇలా చాలా మందే ఉన్నారు. ఇందులో ఎన్నికల కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు పేరు ఉండటం చర్చనీయాంశమైంది. ఓటర్ల జాబితాలో పేర్ల వ్యత్యాసాలు, మ్యాపింగ్ లేకపోవడంపై నోటీసులు అందుకున్న ఉన్నత స్థాయి అధికారులలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే, ప్రధానమంత్రి ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల, మత్స్యశాఖ కార్యదర్శి అభిలక్ష్ లిఖి, ఆయన భార్య సుకృతి, ఎరువుల కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా, భూ వనరుల కార్యదర్శి నరేంద్ర భూషణ్, వ్యయ కార్యదర్శి వూమ్లున్‌మాంగ్ వూల్నామ్ ఉన్నారు.

అవకతవకలకు గాను పలువురు రిటైర్డ్ అధికారులు, బ్యూరోక్రాట్లు కూడా నోటీసులు అందుకున్నారు. వారిలో నీతి ఆయోగ్ మాజీ వైస్-ఛైర్మన్ అరవింద్ పనగరియా, జేఎన్‌యూ మాజీ వైస్-ఛాన్సలర్, యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, మాజీ పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ్, మాజీ వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్, ఆయన భార్య, మాజీ సీఐఎస్ఎఫ్ డైరెక్టర్-జనరల్ నీనా సింగ్, మాజీ రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ ఆరమనే, మాజీ పర్యావరణ శాఖ కార్యదర్శి లీనా నందన్ ఉన్నారు. వీరితో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కుటుంబం, ప్రముఖ లాయర్, ఎంపీ కపిల్ సిబల్ వంటి వారు కూడా ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్నారు. అంతకు ముందే డిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రివాల్, న్యూఢిల్లీ బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు వీరేంద్ర కుమార్ సచ్‌దేవా కూడా ఉన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది.














Click it and Unblock the Notifications
