ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రికే స్కెచ్ వేసిన కొడుకు...
సమాజంలో రోజురోజుకూ మానవ విలువలు మంట కలిసిపోతున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం సొంత వారినే కడతేర్చేందుకు చూస్తున్నారు. మొన్నటికి మొన్న ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఏకంగా తల్లినే పొట్టన పెట్టుకోవాలని చూశాడు. తాజాగా ఇప్పుడు అలాంటి ఓ ఘటనే జార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. ప్రభుత్వం ఉద్యోగం కోసం ఓ పాతికేళ్ల కుర్రాడు ఏకంగా తన తండ్రినే చంపేందుకు ప్రయత్నించాడు. అందుకోసం కొందరు దుండగులకు సుపారీ కూడా ఇచ్చాడు.
తండ్రిని చంపేందుకు సుపారీ ఇచ్చిన కొడుకు : ఈ సంఘటన జార్ఖండ్‌లో వెలుగుచూసింది. రామ్‌గఢ్‌లో రామ్‌జీ అనే ఓ వ్యక్తి తన కుటుంబంతో నివాసముంటున్నాడు. ఆయన సెంట్రల్ కోల్డ్‌ఫీల్డ్ లిమిటెడ్ (సిసిఎల్) ఉద్యోగం చేస్తుంటారు. రామ్‌జీకి ముగ్గురు పిల్లలు. అందులో పెద్ద కుమారుడు అమిత్‌కు పాతికేళ్లు. అమిత్ ప్రస్తుతం తన చదువు పూర్తిచేసుకుని ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాడు. అయితే, ఆ యువకుడికి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలనే ఓ దుర్భుద్ధి కలిగింది. దాంతో తన తండ్రి మరణిస్తే తనకు కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగం వస్తుంది కదా అని ఆలోచించాడు. ఆ దురాశతో ఏకంగా తండ్రిని చంపేందుకు పథకం వేశాడు. అందుకోసం కొంతమంది కిరాయి హంతకులకు సుపారీ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో తండ్రి గురించి అన్ని విషయాలను తెలిసిన అమిత్ తండ్రి బయటికి వెళ్లగానే ఆ సుపారీ వాళ్లకు సమాచారం ఇచ్చాడు.

రామ్‌జీ ఛాతీపై కాల్పులు జరిపించిన కుమారుడు : నవంబర్ 16 వ తేది సాయంత్రం బయటికి వెళ్లిన రామ్‌జీను రామ్‌గఢ్-పట్రాటు హైవేలోని మట్కామా చౌక్ వద్ద కొంతమంది గుర్తు తెలియని దుండుగులు బైక్‌పై వచ్చి అతని ఛాతీపై కాల్పులు జరిపారు. అది గమనించిన చుట్టుపక్కల వారు అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు రామ్‌జీని రాంచీలోని మేదాంత ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ అతని పరిస్థితి కాస్త విషమంగానే ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న రామ్‌గఢ్ పోలీసులు కుటుంబసభ్యులను విచారించగా కుమారుడు అమిత్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది.
దాంతో ఆదివారం నాడు రామ్‌జీ 25 ఏళ్ల పెద్ద కుమారుడు అమిత్ ముండాను అతని తండ్రిపై హత్యాప్రయత్నం చేసిన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అమిత్ ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. ఒక సిసిఎల్ ఉద్యోగిపై ఇలా కుటుంబసభ్యులే హత్యప్రయత్నం చేయడం ఇదేమీ మొదటిసారి కాదని ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications