Sonia Gandhi : ఢిల్లీ కాలుష్యం దెబ్బ- జైపూర్ కు మకాం మారుస్తున్న సోనియాగాంధీ...
దేశ రాజధానిలో అంతకంతకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యం సాధారణ ప్రజలతో పాటు వీఐపీల్ని సైతం కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకోవాలంటే రాజధానిని వదిలి వెళ్లిపోవడమే మేలన్న ఫీలింగ్ వారిలో పెరిగిపోతోంది. ఇదే క్రమంలో శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఢిల్లీని వీడి రాజస్తాన్ లోని పింక్ సిటీ జైపూర్ కు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు.
దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తక్కువ కాలుష్యం ఉన్న జైపూర్‌కు మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 76 ఏళ్ల సోనియా గాంధీ గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ప్రదేశానికి తరలి వెళ్లాలని వైద్యులు సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జైపూర్‌లో తన తల్లిని కలవనున్నారు.

ఢిల్లీలో గాలి నాణ్యతపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు విడుదల చేసిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో ఢిల్లీ సగటు గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంది. ఢిల్లీలో వాయు కాలుష్య సూచీ ఏక్యూఐ 397 వద్ద ఉండగా, జైపూర్ ఏక్యూఐ 264గా ఉంది. ఈ సెప్టెంబరులో సోనియా గాంధీ వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె శ్వాసకోశ సమస్యల కారణంగా జనవరిలో కూడా ఆసుపత్రిలో చేరారు.
అయితే దేశ రాజధానిలో గాలి కాలుష్యం కారణంగా సోనియాగాంధీ వేరే ప్రాంతానికి వెళ్లడం ఇదే తొలిసారి కాదు. 2020 నవంబర్ లోనూ ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉండటంతో ఆమె ఛాతీ ఇన్ఫెక్షన్ తీవ్రతరం కావడంతో తాత్కాలికంగా గోవాకు మారారు.ఇప్పుడు మరోసారి ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గిపోతుండటంతో సోనియాగాంధీ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. అందుకే ఆమె జైపూర్ కు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications