రియల్ హీరో సోను సూద్ మరో కీలక నిర్ణయం... ఆక్సిజన్ కాన్సంట్రేటర్ డోర్ డెలివరీ... అందుబాటులోకి హెల్ప్ లైన్
ఇన్ని ప్రభుత్వాలు,ఇన్ని వ్యవస్థలు,వేలాదిమంది సెలబ్రిటీలు... వీళ్లెవరూ చేయలేని పనులు సోను సూద్ చేస్తున్నాడు. కరోనా వేళ సోను ఒక సైన్యంలా సేవలందిస్తున్నాడు. 400 పైచిలుకు మంది నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఏ విజ్ఞప్తి వచ్చినా నిమిషాల్లో సాయం అందిస్తున్నాడు. సోను సూద్ ట్విట్టర్ వాల్ పైకి వెళ్లి చూస్తే... బెడ్ అరేంజ్ చేశాం,మందులు డెలివరీ అయ్యాయి,ప్లాస్మా అందించాం,ఆక్సిజన్ పంపించాం... అన్నీ ఇలాంటి పోస్టులే కనిపిస్తాయి. ఆపదలో ఉన్నవాళ్లెవరైనా సరే... ఒక్క ట్వీట్ చేస్తే చాలు సోను టీమ్ వెంటనే స్పందిస్తోంది. నిత్యం లక్షల్లో వచ్చే మెసేజ్‌లు,ఫోన్ కాల్స్‌ను హ్యాండిల్ చేస్తూ ఇంత భారీ ఎత్తున సాయం అందించడం మామూలు విషయం కాదు. అందుకే చాలామంది సోనును ఏకంగా పేదల పాలిట దేవుడు అంటూ కొనియాడుతున్నారు.
ఢిల్లీ వాసుల కోసం హెల్ప్ లైన్...
తాజాగా సోను సూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఎక్కువ కరోనా కేసులు ఉండటం,అక్కడి ప్రజల నుంచి ఆక్సిజన్ కోసం ఎక్కువ అభ్యర్థనలు వస్తుండటంతో.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక హెల్ప్ లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ ప్రజలెవరైనా ఆక్సిజన్ కావాల్సి వస్తే 022-61403615 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను డోర్ డెలివరీ చేస్తారు. ఆక్సిజన్ కోసం కరోనా పేషెంట్లు అల్లాడుతున్న వేళ సోను సూద్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏకంగా ఇంటికే పంపిస్తానని చెప్పడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

కరోనా మొదటి వేవ్ నుంచి...
సోను సూద్ తన సూద్ ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతేడాది కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ సందర్భంగా మొదటిసారి వలస కూలీల వ్యథలు చూడలేక సోను సూద్ వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వలస కూలీలను గమ్య స్థానాలకు చేర్చాడు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సైతం ప్రత్యేక విమానం ద్వారా ఆయన స్వదేశానికి చేర్చారు.

రియల్ హీరో సోను సూద్...
ఇక కరోనా సెకండ్ వేవ్‌లో సోను సూద్ చేస్తున్న సాయం మాటలకు అందనిది. తాను సంపాదించిన మొత్తాన్ని ఇప్పటికే దాదాపుగా ఖర్చు పెట్టేసిన సూద్... తనకు అందుతున్న విరాళాల ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. సోను అందిస్తున్న సాయాన్ని చూసి సామాన్యులు సైతం ఆయన ఫౌండేషన్‌కు విరాళాలు ఇస్తున్నారు. సోను లాంటి వ్యక్తులకు అండగా నిలబడితే దేశంలో ఎంతోమంది ప్రజల ప్రాణాలు నిలబడుతాయని చాలామంది బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు మరింతగా నిలబెట్టుకుంటున్నాడు సోను సూద్. ఇటీవల నాగ్‌పూర్‌కి చెందిన భారతి అనే కోవిడ్ రోగిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ చేర్చాడు. ఆమె బతికే అవకాశాలు 20 శాతం మాత్రమేనని తెలిసినా.. చివరికంటా ప్రయత్నించాడు. చివరకు ఆమె చనిపోయినా సోను సూద్ చేసిన సాయం అందరినీ కదిలించింది. ఇటీవలే ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించి ఆయా రాష్ట్రాలకు అందజేశాడు. అందుకే సోను సూద్‌ను దేశమంతా రియల్ హీరో అని కొనియాడుతోంది.












Click it and Unblock the Notifications