టీమిండియా ఓటమి చిచ్చు, కాశ్మీర్ నిట్‌లో టెన్షన్: దాడులు, చిక్కుకున్న నల్గొండ విద్యార్థులు
శ్రీనగర్: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భారత జట్టు ఓటమి శ్రీనగర్‌లో ఇప్పటికీ వేడిని రాజేస్తోంది. విద్యార్థుల మధ్య మ్యాచ్ ఓటమి విషయంలో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. మంగళవారం శ్రీనగర్లోని ఎన్ఐటీలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో.. పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు కేంద్రం ఇద్దరు వ్యక్తులతో కూడిన బృందాన్ని పంపింది.
నిట్‌లో నాన్ లోకల్ విద్యార్థులు మూడు రంగలు జెండాలు చేతిలో పట్టుకొని పరీక్షలను వాయిదా వేయాలని మంగళవారం భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. వారు మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు.

ఈ ఘటనలో విద్యార్థులకు, పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, బెటాలియన్లను మోహరించారు. శ్రీనగర్ ఎన్ఐటీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్షల గురించి ప్రభుత్వం చూసుకుంటుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
మరోవైపు, ఎన్ఐటీలో పరిస్థితులను జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబ్ ముఫ్తీని అడిగి తెలుసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
ట్వంటీ 20 చిచ్చు.. నల్గొండ విద్యార్థుల చిక్కులు
వర్సిటీలో ట్వంటీ 20 చిచ్చు నేపథ్యంలో క్యాంపస్‌లో ఉద్రిక్తత కనిపిస్తోంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. పోటాపోటీ ధర్నాలు చేస్తున్నారు. ఈ వర్సిటీలో చదువుతున్న నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో వారు ఇబ్బంది పడుతున్నారు. ఘటనలో వందమంది వరకు గాయపడ్డారని తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే... ట్వంటీ 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో విండీస్ చేతిలో భారత్ ఓటమి పాలవడంతో శ్రీనగర్ ఎన్ఐటీ కాశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవ తలెత్తింది. టీమిండియా ఓడిపోగానే స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. భారత్ వ్యతిరేక, పాక్ అనుకూల నినాదాలు చేశారు. దానిని స్థానికేతర విద్యార్థులు తప్పుపట్టారు. పాక్ వ్యతిరేక నినాదాలు ప్రారంభించారు. ఇది గొడవకు కారణమైంది.












Click it and Unblock the Notifications