శశికళ వర్సెస్ పన్నీరు.. ఏం జరగనుంది?: ఇలా సీఎం రేసులోకి స్టాలిన్!
తమిళనాడు రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. పన్నీరు సెల్వం రాజీనామాను వెనక్కి తీసుకోవడం చట్ట ప్రకారం కుదరదని అంటున్నారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. పన్నీరు సెల్వం రాజీనామాను వెనక్కి తీసుకోవడం చట్ట ప్రకారం కుదరదని అంటున్నారు. అలాగే, శశికళ పైన అసంతృప్తుల వెల్లువ కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తమిళనాడులో అసలు ఏం జరగనుందనే చర్చ సాగుతోంది. తెరపైకి స్టాలిన్ పేరు కూడా రావడం గమనార్హం. శశికళ, పన్నీర్ సెల్వంల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో 97 మంది ఎమ్మెల్యేల మద్దతు (డీఎంకే 89, కాంగ్రెస్ 8)తో ఎంకే స్టాలిన్ అవకాశం కోసం కాచుక్కూర్చున్నారు.
తమిళనాడు పీఠం పైన కూర్చోవాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు వసరం. ఇప్పుడు తమిళనాడు రాజకీయ సంక్షోభం ట్వంటీ 20 మ్యాచ్‌ను తలపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం కోసం శశికళ, పన్నీరు సెల్వంలతో పాటు స్టాలిన్ కూడా కాచుకొని కూర్చున్నారు.
ఇందులోభాగంగా, రోడ్లపై కాకుండా అసెంబ్లీ వేదికగా బల నిరూపణకు సిద్ధమని పన్నీర్ సెల్వం బాహాటంగా ప్రకటించారు. అయితే ఆయన వైపు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. శశికళతో భేటీకి 131 మంది ఎమ్మెల్యేలు హాజరైనా.. చివరి వరకు ఎందరు మిగులుతారనేది ప్రశ్నే. బీజేపీ, టీడీపీలు ప్రలోభాలకు గురి చేస్తాయని ఇప్పటికే వారిని హోటల్స్‌కు తరలించారు.

తొలుత సగం మంది గైర్హాజరు
బుధవారం ఉదయం ది గంటలకు సమావేశానికి రావాల్సిందిగా శశికళ ఇచ్చిన పిలుపుకు మద్దతు కరువైంది. అన్నాడీఎంకేలో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో శశికళ సమావేశాన్ని ఓ గంటపాటు వాయిదా వేశారు. ఈ సమావేశానికి శశికళ వర్గం 129 మంది వచ్చారని చెపుతుంటే.. వాస్తవానికి 123 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారన్నది పన్నీర్ వర్గం నేతలు చెబుతున్న మాట.

అందరూ మద్దతివ్వకపోవచ్చు
అయితే సమావేశానికి హాజరైన ఈ ఎమ్మెల్యేలంతా ఆమెకు మద్దతు ఇస్తారని చెప్పలేం. ఒకవేళ ఈ 123 మంది మద్దతిస్తే మాత్రం పన్నీరు సెల్వంకు గడ్డు కాలమే. కానీ, డీఎంకేకు చెందిన 89 మంది ఎమ్మెల్యేలుగానీ పన్నీర్ సెల్వంకు మద్దతిస్తే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పటికే స్టాలిన్ కూడా పన్నీరు సెల్వం వైపే మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పన్నీరుకు అంశాల వారీగా మద్దతిస్తామని చెప్పారు.

స్టాలిన్‌కు అవకాశం
అదీ కాకుండా.. అన్నాడీఎంకేకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలను తన వైపునకు స్టాలిన్ ఆకర్షించగలిగితే ఆయనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవచ్చు. డీఎంకేకు చెందిన 89 మంది, 8 మంది కాంగ్రెస్, 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కలుపుకుని 119 మంది సభ్యులతో ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు లేకపోలేదు.

ఇదీ సంఖ్య
ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్లు 234. ఇందులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 135 మంది. డీఎంకే ఎమ్మెల్యేలు 89. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. 8. ఐయూఎమ్‌ఎల్ 1. జయలలిత మరణంతో ఆర్కే నగర్ ఎమ్మెల్యే స్థానం ఖాళీగా ఉంది. ఇవీ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో పార్టీల బలాబలాలు. ఈ లెక్కల ప్రకారం తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శశికళ వర్గానికి గానీ, పన్నీరు వర్గానికి గానీ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి.












Click it and Unblock the Notifications