రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట: 27మంది మృతి, 30మందికి గాయాలు, అసలేం జరిగిందంటే?
ముంబై: మహారాష్ట్రంలోని ముంబై ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కురియడంతో ఒక్కసారిగా అక్కడున్న జనమంతా రైల్వే స్టేషన్లోకి దూసుకొచ్చారు. ఫుటోవర్ బ్రిడ్జీపై కూడా భారీ జనం ఉండటంతో తొక్కిసలాట జరిగింది.

27మంది మృతి
ఈ తొక్కిసలాటలో 27మంది మృతి చెందగా, మరో 30మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రైల్వే, పోలీసు సిబ్బంది సహాయకచర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘోరమంతా 15-20నిమిషాల్లో జరగడం గమనార్హం.

వర్షమే ప్రధాన కారణం..
వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రులకు తరలించారు. ముంబై కార్పొరేషన్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొని గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. వర్షంలో తడవకూడదనే కారణంతోనే ప్రయాణికులు స్టేషన్లోకి చొచ్చుకురావడమే ఈ ప్రమాదానికి కారణం కావడం గమనార్హం.

స్పందించిన స్థానికులు
తొక్కిసలాటలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు రైల్వే స్టేషన్‌కి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

వర్షం కారణంగా భారీగా జనం
వర్షం కారణంగా భారీగా జనం రావడంతో రైల్వే స్టేషన్ ఆవరణలోని పుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో మరణాల సంఖ్య బాగా పెరిగిందని పలువురు చెబుతున్నారు. అంతేగాక, పలువురు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదాని ప్రకారం.. ఈ తొక్కిసలాటకు విద్యుత్ షాట్ సర్క్యూట్ కూడా కారణంగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, క్షతగాత్రులు చికిత్స పొందుతున్న కేఈఎం ఆస్పత్రి హెల్ప్ లైన్ నెం. 022-24107000ను విడుదల చేశారు.
తొక్కిసలాట జరిగిందిలా.. ఘటనా స్థలానికి కేంద్రమంత్రి
పరేల్ రోడ్, ఎల్పిన్‌స్టోన్ రైల్వే స్టేషన్లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జి అప్పటికే పండగలకు వెళుతున్న ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దీనికి తోడుగా భారీ వర్షం కురియడం, రెండు స్టేషన్లలో నాలుగు రైళ్లు ఒకేసారి రావడం తొక్కిసలాట దారితీసింది. ఒకేసారి ప్రయాణికులందరూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైకి చేరుకోవడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఎప్పుడో బ్రిటీషర్ల కాలంలో నిర్మించిన ఆ బ్రిడ్జి వెడల్పు తక్కువగా ఉండటం, భారీ జనం తోసుకుంటూ రావడంతో కొందరు మహిళలు కిందపడిపోయారు. దీంతో ఏర్పడిన గందరగోళం భారీ తొక్కిసలాటకు దారితీసింది. కొందరు బ్రిడ్జిపై నుంచి దూకేయడం గమనార్హం. కాగా, ఇక్కడ కొత్తగా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు అధికారులు. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించారు.
ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తి చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications