విషం: సునంద పుష్కర్ మృతిపై సుబ్రహ్మణ్య స్వామి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతిపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సునందది హత్య కావొచ్చునని, ప్రీ ప్లాన్డ్ హత్య కావొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. సునంద మృతదేహంపై గాయాలు ఉన్నాయన్నారు.
ఆమెకు పాయిజన్ ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి సునంద పుష్కర్ మృతి విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ సోమవారం ట్వీట్ కూడా చేశారు. అయితే, స్వామి వ్యాఖ్యలను శశి థరూర్ కొట్టి పారేశారు.
కాగా, తాను సునంద పుష్కర్‌ను చాలా మిస్ అవుతున్నానని, తనకు ఎన్నో అనుభూతులను మిగిల్చి ఆమె వెళ్లిపోయిందని శశి థరూర్ ఆదివారం అన్న విషయం తెలిసిందే. ఓ న్యూస్ ఛానల్‌తో ఆయన మాట్లాడారు. అదే సమయంలో పోలీసుల దర్యాఫ్తును ఆయన తప్పు పట్టారు.

సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాఫ్తు వేగవంతంగా లేదని శశి థరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్య సంబంధితం కారణాలతోనే మృతి చెందినట్లుగా స్పష్టమవుతోందని చెప్పారు. కేసును పొడిగించడానికి ఎలాంటి కారణాలు లేవని ఆయన అన్నారు.
సునంద మృతి చెంది అయిదు వారాలు అవుతున్నా అర్థం పర్థం లేని ఊహలతో కేసును సాగదిస్తూ ముగించడం లేదన్నారు. తనపై వ్యక్తిగతంగా కేసు ఏమీ లేకున్నా పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నానని తెలిపారు. ఢిల్లీ పోలీసుల దర్యాఫ్తుపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. పోలీసులు ఎఫ్ఐఆర్, అభియోగ పత్రం నమోదు చేయలేదని, కేసును ఇంకా పొడిగించడానికి ఎలాంటి కారణాలు లేవన్నారు.
ఈ విషయంలో సునంద తనయుడు, తండ్రి, సోదరుడు అందరు తనకు అండగా ఉన్నారని చెప్పారు. ఇందులో ఎలాంటి కుట్ర కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. తాను ఆమెను ప్రతి క్షణం మిస్ అయ్యానని, తనకు ఆమె ఎన్నో అనుభూతులను మిగిల్చిందన్నారు.












Click it and Unblock the Notifications