ఈసీకి నేరుగా 48 ప్రశ్నలు - విపక్షాల పిటిషన్ పై సుప్రీం కీలక నిర్ణయం..!
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు, అమలులో తీసుకున్న నిర్ణయాలకు బాధ్యులెవరు, వాటి చట్టబద్ధత ఎంత వంటి 48 ప్రశ్నల్ని ఎన్నికల కమిషన్ ను నేరుగా అడిగేందుకు అనుమతించాలంటూ విపక్ష ఇండియా కూటమి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు (Supreme Court) విచారణకు స్వీకరించింది. దీనిపై డిసెంబర్ 9న విచారణ జరపాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయనే ఫిర్యాదులు వచ్చాయి. వీటిని తిరిగి చేర్చే విషయంలో ఎన్నికల కమిషన్ మొండిపట్టుదలకు పోయింది. దీంతో విపక్షాలు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై కోర్టులు కూడా తీవ్రంగా స్పందించకుండా ట్రైబ్యునల్స్ కు వెళ్లాలని సూచిస్తూ వచ్చాయి. కానీ ఎన్నికల సంఘంలో కమిషనర్లతో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఎస్ఐఆర్ విషయంలో తీవ్రంగా విభేదించినట్లు తేలడంతో విపక్షాలు రోడ్డెక్కాయి. ఢిల్లీలో తీవ్ర నిరసనలకు దిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ వరుసగా దిద్దుబాటు చర్యలు ప్రకటించింది.

అయితే ప్రస్తుతానికి దిద్దుబాటు చర్యలు చేపట్టినా దీని వల్ల నష్టపోయిన ఓటర్లు, ఈ ఓటర్ల జాబితాలతో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్నికల సంఘాన్ని 48 ప్రశ్నలు నేరుగా అడిగేందుకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీన్ని విచారణకు స్వీకరిస్తూ సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఈ వ్యవహారంపై ఈసీకి నోటీసులు జారీ చేయాలని సీజేఐ సూర్యకాంత్ భావించినా.. లాయర్లు అంగీకరించలేదు. దీంతో ఈ కేసులో ప్రాథమిక విచారణ తర్వాత దీనిపై తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. మరోవైపు విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లో 48 ప్రశ్నల్ని సీఈసీ జ్ఞానేష్ కుమార్, ఇద్దరు కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్ బీర్ సింగ్ సంధూతో పాటు ఇతర ఈసీ అధికారులకు సంధించినవి ఉన్నాయి. ఇవన్నీ నేరుగా వారినే అడిగేందుకు సుప్రీంకోర్టు అనుమతిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
