పెగాసస్ పై సుప్రీం కీలక నిర్ణయం-నిపుణుల కమిటీ-ఆరోపణల్ని కేంద్రం తిరస్కరించకపోవడంతో-
ఈ మధ్య కాలంలో దేశంలో రాజకీయ నేతల్ని, వీపీఐపీల్ని కుదిపేసిన పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విపక్ష నేతలు, అధికారులు, జర్నలిస్టులపై ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో కేంద్రం గూఢచర్యం చేస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. వీటిని కేంద్రం స్పష్టంగా తిరస్కరించలేకపోయింది. దీంతో సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
పెగాసస్ స్పైవేర్ వివాదంపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు ఓ స్వతంత్ర నిపుణుల కమిటీని నియమిస్తూ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్ పై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటిషన్లతో ఏకీభవించిన సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ సాయంతో దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇరుకునపడింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను మీరు వాడారా లేదా అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయిస్తామని మాత్రమే కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది దీంంతో సంతృప్తి చెందని సుప్రీంకోర్టు ధర్మాసనం తామే స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించి దర్యాప్తు చేయించాలని నిర్ణయం తీసుకుంది.

పెగాసస్ స్పైవేర్ ను కేంద్రం వాడిందో లేదో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. ఇలా ఎవరికి వారు స్పైవేర్లు వాడుకుంటూ పోతే అవి తీవ్రవాదులకు అస్త్రాలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో కేంద్రం నిపుణుల కమిటీని నియమిస్తుందని తుషార్ మెహతా చెప్పుకొచ్చారు. అలాగే ఈ వివాదంపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేసేందుకు కూడా కేంద్రం నిరాకరించింది. ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదని, దీనిపై ప్రజల్లోనూ చర్చ జరగడం లేదంటూ చెప్పుకొచ్చింది. కానీ సుప్రీం ఈ వాదనతో సంతృప్తి చెందలేదు.
దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో ఏర్పాటు కాబోయే ఈ కమిటీలో సైబర్ సెక్యూరిటీ ఫోరెన్సిక్ నేపథ్యం ఉన్న మరో ఇద్దరు సభ్యులుగా ఉంటారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం తీర్పులో పేర్కొంది. వీరు పెగాసస్ స్పైవేర్ కు సంబంథించి వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపి తిరిగి సుప్రీంకోర్టుకే నివేదిక ఇవ్వనున్నారు. ఈ వ్యవహారంపై సునిశిత దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఏయే అంశాలపై దర్యాప్తు చేయించాలన్న దానిపైనా తీర్పులో స్పష్టత ఇచ్చింది.












Click it and Unblock the Notifications