UPSC ని చూసి నేర్చుకోండి..! పేపర్ లీక్స్ పై NTA కి సుప్రీం చీవాట్లు..!
ఈ ఏడాది వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష (NEET UG 2026) ప్రశ్నాపత్రం లీక్ విషయంలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ చీవాట్లు పెట్టింది. జేఈఈ, నీట్ వంటి జాతీయ స్దాయి పరీక్షల నిర్వహణ చూస్తున్న ఎన్టీఏ పనితీరును తీవ్రంగా ఆక్షేపించింది. ఈ విషయంలో మరో కేంద్ర ప్రభుత్వ సంస్ద యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని ఎన్టీఏకు సూచించింది. ఇప్పటివరకూ యూపీఎస్సీ చరిత్రలో ఎప్పుడూ పేపర్ లీక్ కాలేదని గుర్తుచేసింది.
పర్యవేక్షణ యంత్రాంగాలు, పర్యవేక్షక కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరిగిందని నీట్ పేపర్ లీక్ పై ఎన్టీఏను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యూపీఎస్సీతో పోలుస్తూ, దేశంలోని అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని, దాని వ్యవస్థల నుండి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది.ఈ విచారణలో ఎన్‌టీఏ, మాజీ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. కేంద్రానికి తమ స్పందనను దాఖలు చేయడానికి అదనపు సమయం ఇస్తూ, ఎన్‌టీఏ , రాధాకృష్ణన్ దాఖలు చేసిన అఫిడవిట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

కమిటీ సిఫార్సుల మేరకు జరిగిన పర్యవేక్షణ స్థాయి గురించి జస్టిస్ పి.ఎస్.నరసింహ డాక్టర్ రాధాకృష్ణన్‌ను ప్రశ్నించారు. పర్యవేక్షణ కమిటీకి నియమితులు కాకముందు డాక్టర్ రాధాకృష్ణన్ మొదట ఉన్నత స్థాయి కమిటీలో పనిచేశారని గమనించిన జస్టిస్ నరసింహ సూచనల అమలుపై వాస్తవంగా ఏ మేరకు పర్యవేక్షణ జరిగిందని ప్రశ్నించారు. గతంలో సిఫార్సు చేసిన రక్షణ చర్యలు ఉన్నప్పటికీ, పత్రాల లీకేజీ జరగడానికి కారణమైన, కమిటీ ఏ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదా అని కోర్టు ఆయన్ను నిలదీసింది. అయితే పరీక్షల భద్రత, నిర్వహణను బలోపేతం చేసే లక్ష్యంతో కమిటీ మొత్తం 101 సిఫార్సులను సమర్పించిందని డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. వీటిలో 60 గతేడాది పరీక్షల కాలంలో అమలు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన స్వల్పకాలిక సిఫార్సులని తెలిపారు. వీటిలో చాలా వరకూ అమలు జరిగిందన్నారు.

లీక్ ఎలా జరిగిందని నేరుగా అడగ్గా, ప్రశ్నపత్రాల రూపకల్పన ప్రక్రియ నుండే ఈ సమస్య తలెత్తిందని డాక్టర్ రాధాకృష్ణన్ చెప్పారు. సురక్షితమైన పరీక్షల అమలు ఫ్రేమ్‌వర్క్‌ను ఇప్పటికే ప్రారంభించామని, ఈ మార్పులతో పరీక్షా వ్యవస్థల మెరుగుపడిందన్నారు. గుర్తించిన లోపాలను సరిదిద్దామని, వచ్చే పునఃపరీక్షలో ఇలాంటి సంఘటన పునరావృతం కాదని డాక్టర్ రాధాకృష్ణన్ ధర్మాసనానికి హామీ ఇచ్చారు. దీంతో సుప్రీంకోర్టు.. జవాబుదారీతనాన్ని సరిదిద్దనంత వరకు కేవలం సంస్కరణలతో సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications