కేంద్రంపై సుప్రీం మరోసారి ఫైర్- ద్వేషపూరిత ప్రసంగాల కేసులపై కమిటీకి ఆదేశం..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓ వర్గం,కులం, మతాన్ని టార్గెట్ గా చేసుకుని కొందరు చేస్తున్న విద్వేష పూరిత ప్రసంగాల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటికి అడ్డుకట్ట వేయడంలో కేంద్రం వైఫల్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని కేంద్రానికి సుప్రీంకోర్టు గుర్తుచేసింది. అంతే కాదు వీటిపై నమోదైన కేసుల దర్యాప్తు కోసం కమిటీని వేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా విద్వేషపూరిత ప్రసంగాల కేసులను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. జర్నలిస్ట్ షాహీన్ అబ్దుల్లా వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇందులో దేశవ్యాప్తంగా జరిగే ర్యాలీలలో ఓ మతానికి చెందిన సభ్యులను చంపడానికి, వారి ఆర్థిక, సామాజిక బహిష్కరణకు పిలుపునిచ్చే కఠినమైన ద్వేషపూరిత ప్రసంగాలను అణిచివేసేందుకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును పిటిషనర్ అభ్యర్థించారు. హర్యానాలో గత వారం జరిగిన మత ఘర్షణల్లో ఆరుగురు మరణించారని గుర్తుచేశారు.

దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం .. వర్గాల మధ్య సామరస్యం, మత సామరస్యం ఉండాలని పేర్కొంది. దీనికి అన్ని సంఘాలు బాధ్యత వహించాలని తెలిపింది. ద్వేషపూరిత ప్రసంగం సమస్య మంచిది కాదని, దానిని ఎవరూ అంగీకరించలేరని పేర్కొంది. ఆగస్టు 18లోగా కమిటీకి సంబంధించిన సూచనలు, సమాధానం ఇవ్వాలని కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌కు కోర్టు తెలిపింది.
వీడియోలతో సహా అన్ని విషయాలను క్రోడీకరించి నోడల్ అధికారులకు ఇవ్వాలని పిటిషనర్‌కు ధర్మాసనం తెలిపింది.
వివిధ ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్‌లకు వచ్చిన విద్వేషపూరిత ప్రసంగాల ఫిర్యాదులను పరిశీలించే కమిటీని ఏర్పాటు చేయాలని పోలీసు చీఫ్‌కు సుప్రీంకోర్టు ఆదేశిస్తుందని జస్టిస్ ఖన్నా చెప్పారు. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 18కి వాయిదా వేశారు. హర్యానాలోని నుహ్ జిల్లాలో మత హింస చెలరేగి గురుగ్రామ్ నగరంలోకి విస్తరించిన ఆరు రోజుల తర్వాత ఉద్రిక్తతల మధ్య ఆగస్టు 7న హర్యానాలోని గురుగ్రామ్‌లో మహాపంచాయత్ జరిగింది. హిందూ సమాజ్ మహాపంచాయత్ నిర్వహించిన సభకు పోలీసుల అనుమతి లేదు.












Click it and Unblock the Notifications