కరోనా విలయం: స్విగ్గీ అనూహ్య నిర్ణయం -డెలివరీ బాయ్స్ కోసం ఆ మాత్రం చేయలేమా?
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం నిన్న ఒక్కరోజే 53,476 కొత్త కేసులు, 251 మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా కేసులు 1.17కోట్లు దాటగా, మరణాల సంఖ్య 1.6లక్షలకు పెరిగాయి. అదే సమయంలో టీకాల పంపిణీ జోరుగా సాగుతూ, నిన్నటి వరకు 5,31,45,709మందికి వ్యాక్సిన్లు అందాయి. కరోనా వారియర్లు, 60ఏళ్లు దాటిన వృద్ధులు, 45దాటి వివిధ వ్యాధులతో బాధపడేవారికి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తుండగా, పలు ప్రైవేటు సంస్థలు సైతం సొంత ఖర్చులతో సిబ్బందికి వ్యాక్సిన్లు అందించాలని భావిస్తున్నాయి..
ఎంపిక చేసిన ప్రభుత్వాస్పత్రుల్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ప్రభుత్వం ఉచితంగా వేస్తుండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆ టీకాల ఒక్కో డోస్ ధరను రూ. 250గా నిర్ణయించారు. ప్రతి వ్యక్తి రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో ప్రఖ్యాత ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. డెలివరీ బాయ్స్ తోపాటు ఇతర విభాగాల్లోని సిబ్బంది అందరికీ ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్లను అందిస్తామని స్విగ్గీ సంస్థ ప్రకటించింది.

డెలివరీ బాయ్స్ కరోనా టీకాలు వేయించుకుంటే అందుకయ్యే ఖర్చును సంస్థే భరిస్తుందని, ఇందు కోసం వ్యాక్సినేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడమా, ఆయా ఊర్లలోని ఆస్పత్రులకు సిబ్బందిని పంపడమా అనేదానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని స్విగ్గీ పేర్కొంది. అంతేకాదు కొవిడ్ టీకా తీసుకున్న రోజు ఆ డెలివరీ సిబ్బందికి వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేస్తామని, రెండు డోసులకూ ఈసెలవులుంటాయని స్విగ్జీ సీఓఓ వివేక్ సుందర్ తెలిపారు.
కరోనా విలయంలో సిబ్బంది భద్రత కోసం సాధ్యమైనంతలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆరోగ్య పరంగా ప్రమాదకర పరిస్థితుల్లోనూ డెలివరీలు అందజేస్తోన్న సిబ్బంది కోసం ఎంత చేసినా తక్కేవే అవుతుందని, ఉచితంగా వ్యాక్సిన్లు అందించే ప్రక్రియ ద్వారా కనీసం 2లక్షల మంది లబ్ధి పొందుతారని స్విగ్గీ సంస్థ పేర్కొంది.












Click it and Unblock the Notifications