సడన్‌గా హీటెక్కిన తమిళ రాజకీయాలు- ఆసుపత్రికి సీఎం స్టాలిన్
చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు చెందిన కీలక నాయకుల నివాసాలపై గతంలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు.. అరెస్టులకు దారి తీశాయి. విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
సెంథిల్ బాలాజీ మనీలాండరింగ్ పాల్పడినట్లు తేలడంతో ఆయనను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ఒమందురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం ఆసుపత్రిలో ఆయనను తోటి మంత్రులు పొన్ముడి, అన్బిల్ మహేష్ సహా డీఎంకేకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తోందని, వాటిని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటోందంటూ మండిపడ్డారు.

కొద్దిసేపటి కిందటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఒమందురార్ ఆసుపత్రికి చేరుకున్నారు. సెంథిల్ బాలాజీని పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన అనంతరం స్టాలిన్ విలేకరులతో క్లుప్తంగా మాట్లడారు. రాజకీయంగా తమను ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశమే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
కాగా- సెంథిల్ బాలాజీ అరెస్ట్ వ్యవహారం రాజకీయ విమర్శలకు దారి తీసింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే- బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటోన్నారు. సెంథిల్ బాలాజీ అరెస్ట్ పట్ల డీఎంకే చేస్తోన్న విమర్శలను వారు తిప్పికొడుతున్నారు. ఈడీ అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారని, ఇందులో రాజకీయ జోక్యం లేదనీ అంటోన్నారు.
ఈ అరెస్ట్‌తో తమిళనాడులో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదికి వచ్చారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. సెంథిల్ బాలాజీ సొంత అసెంబ్లీ నియోజకవర్గం కరూర్‌లో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ర్యాలీ తీశారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications