కిడ్నాప్, రూ.2 కోట్లు డిమాండ్: పోలీస్, కిడ్నాపర్ల మధ్య కాల్పులు
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాదులో ఓ పాఠశాలలో కిడ్నాప్ కలకలం రేపింది. పాఠశాలలోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు, రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు బాలుడిని రక్షించి, కిడ్నాపర్లను అరెస్టు చేశారు.
ఈ కిడ్నాప్ సంఘటన బాలుడి తల్లిదండ్రులు, పోలీసులు, పాఠశాల యాజమాన్యంను కంగారు పెట్టింది. పోలీసులు కిడ్నాపర్ల ఆటకట్టించి విద్యార్థిని రక్షించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సమయంలో స్వల్పంగా కాల్పులు కూడా జరిగాయి.
ఘజియాబాదులోని రాజ్ నగర్ పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలుడిని ముగ్గురు కిడ్నాప్ చేశారు. అతనిని ఓ గదిలో బంధించారు. రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కొద్దిసేపు పోలీసులు, కిడ్నాపర్ల మధ్య కాల్పులు జరిగాయి.
బాలుడు ఆదివారం నుంచి కనిపించడం లేదు. సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో కిడ్నాపర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ విషయాన్ని బాలుడి తండ్రి వివేక్ మహాజన్ చెప్పారు.

కిడ్నాపర్లు తన కొడుకు మొబైల్ ఫోన్ నుంచి కాల్ చేశారని, రూ.2 కోట్లు ఇస్తే వదిలేస్తామని, లేదంటే చంపేస్తామని బెదిరించారని బాలుడి తండ్రి చెప్పారు. దీంతో, తాను పోలీసులను ఆశ్రయించానని చెప్పారు. కిడ్నాప్ చేసిన వారిని సందీప్ కుమార్, దీపక్, అతని సోదరుడు బిట్టుగా పోలీసులు గుర్తించారు.
కిడ్నాప్‌కు గురైన బాలుడు మాట్లాడుతూ... వారు తనను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారని, ఓ గదికి తీసుకు వెళ్లి ఉంచారన్నారు. తనను పిస్టల్‌తో బెదిరించారని చెప్పాడు. వారు తనకు భోజనం పెట్టారని, సోమవారం తనకు ఇంజెక్షన్ ఇవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లానని చెప్పాడు.
నిందితుల్లో ఒకడైన దీపక్ బిపివో రిక్వైర్మెంట్ సెంటర్ నడిపిస్తున్నాడు. సందీప్ కుమార్ ఓ కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని చూస్తున్నాడు. తమకు డబ్బు అవసరమై వారు బాలుడిని కిడ్నాప్ చేసి, వారి తల్లిదండ్రుల నుంచి రాబట్టాలనుకున్నారు.
మరో విషయమేమంటే నిందితుడైన దీపక్ తల్లి అదే పాఠశాలలో పని చేస్తోంది. బాలుడిని వారి ఇంట్లోనే దాచిపెట్టారు. ఈ విషయాన్ని దీపక్ తన తల్లికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఆధునిక సాంకేతికత ద్వారా వారిని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications