ప్రతి ఇంటా ఆనందం: తెలుగు ప్రజలకు సీఎంలు కేసీఆర్, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
హైదరాబాద్/అమరావతి: నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచం 2022 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.

ప్రగతి పథాన: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏటా వినూత్న పంథాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సబ్బండ వర్గాలు ప్రగతి పథాన పురోగమించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. 2022 నూతన సంవత్సరంలో కూడా కష్టాలను అధిగమిస్తూ అదే అకుంఠిత దీక్షతో సుపరిపాలన కొనసాగిస్తూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని సీఎం తెలిపారు. 2022 నూతన సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ప్రతి ఇంటా ఆనందం: ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాది ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. వివక్ష లేకుండా అన్నివర్గాల వారికి తమ ప్రభుత్వం సంక్షేమం అందిస్తోందని సీఎం జగన్ స్పష్టం చేశారు.

కొత్త ఆశలు, ఆకాంక్షలంటూ చంద్రబాబు శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ఆనందోత్సాహాలతో గడవాలని కోరుకున్నారు. ప్రతి ఇంటా సంతోషం, చిరునవ్వులు విరియాలని ఆయన ఆకాంక్షించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. 2022 ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు.

నూతనం ప్రారంభం అంటూ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నూతనం.. ప్రారంభం.. ఆరంభం.. అనే పదాలలోనే ఒక ఉత్తేజం నిండి ఉంటుందని, అటువంటిది కొత్త సంవత్సరం ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు, లక్ష్యాలతో సంగమమై మన ముందుకు తరలివస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. ఇటువంటి 2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారందరితో పాటు భారతీయులందరికీ జనసేన తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. గత రెండేళ్లలో కరోనా మహమ్మారి మానవాళిపై పైచేయి సాధించాలని చేసిన ప్రయత్నాలను మనమందరం చవిచూశామని, అయితే మానవాళి మనో నిబ్బరం, మనోవిజ్ఞానం ముందు కరోనా పలాయనం దిశగా ప్రయాణించడం లోక కళ్యాణంగా భావిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు కరోనా వెళ్లిపోయే ముందు కూడా తన ప్రభావాన్ని చాటాలని ప్రయత్నిస్తూనే ఉందన్నారు. ఇప్పటివరకు ప్రజలు ఎలాంటి జాగూరూకత చూపించారో.. ఇకపైనా అలాగే ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పవన్ ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆరోగ్యవంతమైన, ఆనందమైన జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరోనాతో పాటు అతివృష్టి రూపంలో కూడా ప్రకృతి కొంత కోపాన్ని ప్రదర్శించినా ప్రజల జీవన ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోవడం సంతోషకరమైన పరిణామమన్నారు జనసేనాని.












Click it and Unblock the Notifications