రేపు ముంబైకి కేసీఆర్: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో ప్రత్యేక భేటీ, అజెండా జాతీయ రాజకీయమే!
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈసారి తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ యేతర ముఖ్యమంత్రులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పలువురు ముఖ్యమంత్రులు కూడా ఇటీవల కేంద్రంపై విమర్శలు చేసిన కేసీఆర్‌కు మద్దతు పలికారు.
Recommended Video

మహా సీఎం ఉద్ధవ్ ఆహ్వానం మేరకు ముంబైకి కేసీఆర్
ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ దేశ ఆర్థిక రాజధాని ముంబైకి పయనం కానున్నారు. ఇటీవల కేసీఆర్‌కు ఫోన్ చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే.. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

కేసీఆర్ పోరాటానికి మద్దతంటూ ఉద్ధవ్
దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకునేందుకు సరైన సమయంలో గళం విప్పారని, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించాలని.. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని కేసీఆర్‌కు ఉద్ధవ్ థాక్రే మద్దతు ప్రకటించారు. ముంబై వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని, భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామని ఉద్దవ్ కోరారు.

ఉద్ధవ్ నివాసంలో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చ
ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. మధ్యాహ్నం వరకు ముంబై చేరుకుంటారు సీఎం కేసీఆర్. బాంద్రా కుర్లాలోని ఉద్ధవ్ నివాసానికి వెళ్లి అక్కడ ఆయనతో సమావేశమవుతారు. జాతీయ రాజకీయాలు, దేశ వ్యాప్త పరిస్థితులు, కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలు, భవిష్యత్ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు, పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ఆ ఇద్దరు ముఖ్యమంత్రులతోనూ కేసీఆర్ మంతనాలు
అంతేగాక, తెలంగాణ, మహారాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పాలనా పరమైన అంశాలపై కూడా కేసీఆర్, ఉద్ధవ్ థాక్రేలు చర్చించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ వెంట కొంత మంది టీఆర్ఎస్ కీలక నేతలు కూడా ముంబై వెళ్లనున్నట్లు తెలిసింది. మరోవైపు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కేసీఆర్‌కు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ఏతర కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేసేందుకు వీరంతా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications