కిరణ్ వెళ్తుంటే మహిళా మంత్రుల్నీ ఈడ్చి పడేశారు, ఫైర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయనున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలంగాణ ప్రాంత మహిళా మంత్రులు గీతా రెడ్డి, డికె అరుణ, సునిత లక్ష్మా రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు. మహిళా మంత్రులం అని కూడా చూడకుండా తమను పోలీసులు ఈడ్చి వేస్తుంటే ముఖ్యమంత్రి రాక్షసానందం పొందుతున్నారని వారు ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి దీక్ష ప్రాంగణానికి వెళ్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై డికె అరుణ, గీతా రెడ్డి, సునితలు స్పందించారు. ముఖ్యమంత్రిది అహంకారపూరిత వైఖరి అని, నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. సిఎం తీర్మానంలో తాము భాగస్వామ్యులం కాదల్చుకోలేదన్నారు.

మహిళా మంత్రులను కూడా ఈడ్చి వేస్తుంటే ఆనందం పొందుతున్నారా అని ప్రశ్నించారు. ఈ మౌన దీక్ష ఎందుకు చేస్తున్నారో కిరణ్ చెప్పడం లేదన్నారు. కిరణ్ దీక్ష చేస్తే తెలంగాణ ఆగిపోతుందని తాము భావించడం లేదని కానీ అది సరికాదని చెబుతున్నామన్నారు. కిరణ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మహిళా మంత్రులైన తాము అడ్డుకుంటుంటే కిరణ్ బస్సు దిగి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించే ప్రయత్నం ఎందుకు చేయలేదన్నారు. సీమాంధ్ర ప్రజల పైన ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకు వచ్చిందా అన్నారు. ఆయన సీమాంధ్ర సిఎంగా వ్యహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కిరణ్ ఇక డ్రామాలు బందు చేయాలన్నారు. సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు.
సీమాంధ్ర ప్రాంత సిఎంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని గండ్ర వెంకటరమణ రెడ్డి, షబ్బీర్ అలీలు అన్నారు. రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము అవిశ్వాసం నుండి గట్టెక్కించామన్నారు. మహిళా మంత్రులు అని కూడా చూడకుండా లాగి పడేయడమేమిటన్నారు.












Click it and Unblock the Notifications