జమ్మూ కాశ్మీర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిపై ఉగ్ర దాడి .. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్
జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఉగ్రవాదుల కదలికలతో, భద్రతాదళాల సెర్చ్ ఆపరేషన్ లతో ఉద్రిక్తంగా ఉన్న జమ్మూకాశ్మీర్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో శుక్రవారం ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఆర్మీ సిబ్బందికి ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అయితే ఉగ్రవాదులు పారిపోయారని అధికారులు తెలిపారు.
శ్రీనగర్‌లోని బెమీనా ప్రాంతంలోని స్కిమ్స్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెమీనాలోని స్కిమ్స్ హాస్పిటల్‌లో ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు స్థానిక పౌరులను ఉపయోగించుకుని తప్పించుకోగలిగారు అని శ్రీనగర్ పోలీసులు తెలిపారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున చర్చ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనాస్థలికి అదనపు పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు . పారిపోతున్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ నౌషారా సెక్టార్ లో గురువారం రోజు దీపావళి వేడుకలు జరుపుకున్న తర్వాత, శుక్రవారం నాడు చోటుచేసుకున్న ఊహించని పరిణామంతో ఆర్మీ అప్రమత్తమైంది. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతమంతా భద్రతా దళాలు జల్లెడ పడుతున్నారు. ఇదిలా ఉంటే భారత దేశానికి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ను కాపాడడం పెద్ద సవాల్ గా మారింది. ఒకపక్క డ్రోన్లతో దాడులు చేస్తూ, మరోవైపు లైన్ ఆఫ్ యాచ్యువల్ కంట్రోల్ నుండి చొరపాట్లకు ప్రయత్నిస్తూ జమ్మూకాశ్మీర్లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూక భారత్లో ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉగ్రవాద అనుబంధ సంస్థలను ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపిస్తూ జమ్మూకాశ్మీర్లో జనజీవనాన్ని ఇబ్బంది పెడుతున్నారు.జమ్ము కాశ్మీర్లో సామాన్య పౌరులను మట్టు పెడుతున్నారు. ఈ క్రమంలో భారత ఆర్మీ జమ్ము కాశ్మీర్ పరిరక్షణ కోసం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఇక్కడ కొద్ది రోజులుగా సుదీర్ఘ ఆర్మీ ఆపరేషన్ జరుగుతోంది.పూంచ్ అడవుల్లో దాగి ఉన్నారని భావిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడం కోసం గత 18 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications